KCR: తడిసిన ధాన్యం ప్రభుత్వం కొంటుంది- సీఎం కేసీఆర్

KCR: తడిసిన ధాన్యం ప్రభుత్వం కొంటుంది- సీఎం కేసీఆర్
KCR: రాష్ట్రంలోని వరిధాన్యం కొనుగోలు, పల్లె, పట్టణ ప్రగతి.. గ్రామీణ క్రీడా ప్రాంగణాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

KCR: రాష్ట్రంలోని వరిధాన్యం కొనుగోలు, పల్లె, పట్టణ ప్రగతి.. గ్రామీణ క్రీడా ప్రాంగణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వరి ధాన్యం సేకరణపై ప్రగతి భవన్‌లో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కొంటామన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పటివరకు 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అయితే ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి, ధాన్యం సేకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. రాష్ట్రంలో వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 24 వేల 'గ్రామీణ క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

జూన్ 2న కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని సమావేశంలో సభ్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈనెల 20 నుంచి నిర్వహించాల్సిన ఆ కార్యక్రమాలను జూన్‌ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నేడు దేశం గర్వించే స్థాయిలో పల్లె, పట్టణాల అభివృద్ధి చేస్తున్నామన్నారు.

పల్లె, పట్టణ ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం హర్షణీయం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తొలిసారి 10 గ్రామాలు ఎంపికయ్యాయి. రెండో సారి ప్రకటించిన జాబితాలో మొదటి 20 స్థానాల్లో తెలంగాణ నుంచే 19 గ్రామాలు ఉండడం గొప్ప విషయమన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి ప్రగతి సాధిస్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్.

కూలీల డబ్బులు కేంద్రమే దిల్లీ నుంచి పంచాలనుకోవడం సరికాదన్నారు. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా.. కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉంటాయన్నది రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని, రోజువారి కూలీల డబ్బులు నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైంది కాదన్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇంకా కరెంటు లేక పల్లెలు చీకట్లలో మగ్గుతున్నాయని.. తాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్లెక్కుతున్నారని, విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు సీఎం కేసీఆర్.

కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త పద్మశ్రీ సాలుమరద తిమ్మక్కను ఘనంగా సత్కరించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రగతిభవన్‌కు వచ్చిన 110 ఏళ్ల వయసున్న తిమ్మక్క.. సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో సమీక్ష జరుగుతుండగా.. సీఎం కేసీఆర్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆమెను పరిచయం చేశారు.

వారి సమక్షంలోనే సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో ఆరుగాలం కష్టించి పడించిన పంట రంగుమారడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. అయితే తడిసిన ధాన్యం సేకరిస్తామని సీఎం భరోసా ఇవ్వడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story