KCR: సంక్రాంతిని ఎవరి ఇళ్లల్లో వారే జరుపుకోవాలి - కేసీఆర్‌

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR: కరోనా పరిస్థితి, కేసుల పెరుగుదల, టీజేజర్స్‌ వ్యాక్సినేషన్‌, వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై సమీక్ష చేపట్టారు.

KCR: తెలంగాణలో కరోనా కేసులు భారీగా వస్తుండడం, న్యూఇయర్‌ ఆరంభం తర్వాత ఈ సంఖ్య రోజురోజుకూ వేలల్లో పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయిలో సమీక్షించారు. తెలంగాణలో కరోనా పరిస్థితి, కేసుల పెరుగుదల, టీజేజర్స్‌ వ్యాక్సినేషన్‌, వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతిభవన్‌ లో సమీక్ష చేపట్టారు.

ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు, ఇరిగేషన్‌ శాఖ అధికారులతోనూ ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పరోగతిపై కూడా సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. గత సమీక్ష సందర్భంగా సీఎం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు కేసీఆర్‌కు నివేదించారు.

ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా వున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమీక్షకు మంత్రులు హరీష్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు సీఎస్‌, వైద్యరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే అశ్రద్ధ మాత్రం చేయ‌వ‌ద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని సీఎం కోరారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు.

60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి, చికిత్స చేయించుకోవాలన్నారు. సంక్రాంతిని గుంపులుగా కాకుండా ఎవరి ఇళ్లల్లో వారే తగు జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.

కాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 48వేల 583 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1673 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనాతో మృతి చెందారు. కరోనా బారి నుంచి330 మంది కోలుకోగా, రాష్ట్రంలో ప్రస్తుతం 13వేల 522 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించారు.

Tags

Read MoreRead Less
Next Story