KTR : బండి సంజయ్‌ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమే.. మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

KTR : బండి సంజయ్‌ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమే.. మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.. బండి సంజయ్‌ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనంటూ లేఖలో నిప్పులు చెరిగారు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.. బండి సంజయ్‌ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనంటూ లేఖలో నిప్పులు చెరిగారు.. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.. బీజేపీ ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని గతంలో ఏ గంగలో కలిపారో చెప్పాలన్నారు.. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.. మీ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పాలని ప్రశ్నించారు. కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాద్‌కు అద్భుత అవకాశమై ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసింది మీరు కాదా అని లేఖలో సూటిగా ప్రశ్నించారు కేటీఆర్‌. లక్షలాది యువత ఐటీ ఉద్యోగాలకు గండికొట్టి యువతరం నోట్లో మట్టికొట్టి మళ్లీ మీరే సిగ్గు ఎగ్గు లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా అంటూ బండి సంజయ్‌పై ధ్వజమెత్తారు.

మీ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశవాదమే సిగ్గుతో పదేపదే ఆత్మహత్య చేసుకుంటుందన్నారు కేటీఆర్‌.. యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర మీది అంటూ బండి సంజయ్‌పై నిప్పులు చెరగారు మంత్రి కేటీఆర్‌.. కేంద్రంలోని మీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీదేనన్నారు.. డీమానిటైజేషన్‌, జీఎస్టీ నిర్ణయాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా అంటూ లేఖలో నిలదీశారు.. ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో 20 లక్షల కోట్లో ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమల్లా పార్టీ మీది కాదా అంటూ మండిపడ్డారు. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేని సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం కానీ, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఖాళీలపైన ఒక శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని లేఖలో నిలదీశారు కేటీఆర్‌. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు.. బూటకపు దీక్షకు పూనుకున్న మీరు రాష్ట్ర యువతను రెచ్చగొట్టి, వారిని చదవు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించే కుట్రే ఈ దొంగ దీక్ష అన్నారు.. చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర దీక్ష చేయాలని బండి సంజయ్‌కి సూచించారు మంత్రి కేటీఆర్‌.

హామీ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని కాదన్నారు.. లక్షలాది ఉద్యోగాలను పెండింగ్‌లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలన్నారు. నిజం నిలప్పులాంటిదని, దాన్ని దాచాలని ముట్టుకుంటే చేతులు కాలిపోతాయని అన్నారు.. మీకు ఈ సత్యం బాగా తెలిసినా ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికే దొంగ దీక్షకు పూనుకున్నారంటూ బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story