KTR: దావోస్‌లో కొనసాగుతున్న కేటీఆర్ టూర్.. లైఫ్‌ సైన్సెస్‌ ప్రాధాన్యతపై ప్రసంగం..

KTR: దావోస్‌లో కొనసాగుతున్న కేటీఆర్ టూర్.. లైఫ్‌ సైన్సెస్‌ ప్రాధాన్యతపై ప్రసంగం..
KTR: తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన కొనసాగుతోంది.

KTR: తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా లైఫ్‌ సైన్సెస్ అభివృద్ధి, తీసుకువచ్చిన సంస్కరణలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ చెందిన జి.వి. ప్రసాద్ రెడ్డి, PWCకి చెందిన మహ్మమద్ అథర్ ఈ ప్యానల్ డిస్కషన్ లో పాల్గొన్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో లైఫ్‌ సైన్సెస్‌ మెడికల్ రంగానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్.

లైఫ్‌ సైన్సెస్‌ మెడికల్ రంగానికి ఊతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు ఇండియాలో కొంత తక్కువ మద్దతు ఉందన్నారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడాలంటే భారత లైఫ్‌ సైన్సెస్‌ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమన్నారు.ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ తన బలాన్ని మరింతంగా పెంచుకుంటుందన్నారు. లైఫ్‌ సైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగిందన్నారు కేటీఆర్.

దీనిని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్ ఫార్మా సిటీపేరుతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐతే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు.భవిష్యత్తులో లైఫ్‌ సైన్స్, ఫార్మా రంగం మరింత విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ చాలా నగరాల కంటే ముందుందన్నారు.

భవిష్యత్తులో డ్రగ్‌ డిస్కవరి వైపు లైఫ్ సైన్సెస్‌ ముందుకు వెళ్తుందన్నారు. ఇందుకోసం ఐటీ, ఫార్మా రంగం కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రముఖ గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ నొవార్టిక్‌కు అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఉందన్నారు కేటీఆర్‌. ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతర విధానాలుండాలన్నారు కేటీఆర్. ఈ రంగంలో ఇన్నోవేషన్‌పై పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్‌తో కూడుకున్నవన్నారు.

ఇందుకు కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖలు మరింత చొరవ చూపాలన్నారు. ప్రస్తుతం ఉన్న మందుల తయారీ కాకుండా కొత్త మందుల తయారు చేసే దిశగా కృషి జరగాలన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఔత్సాహికులకు సహకారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మరోవైపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ స్విస్‌ రే ప్రకటించింది. స్విస్‌ రే 160 ఏళ్ల నాటి ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

దావోస్ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన స్విస్‌ రే కంపెనీ ఎండీ వెరోనికా, సంస్థ ప్రతినిధులు కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. హైదరాబాద్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగంలోకి స్విస్‌ రేకు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు కేటీఆర్. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్ యూనిట్‌లో డేటా, డిజిటల్ కేపబిలిటీస్‌, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story