KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..
KTR: చేనేత కార్మికుల సంక్షేమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు..

KTR: చేనేత కార్మికుల సంక్షేమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా టెక్స్‌టైల్‌ రంగానికి బడ్జెట్‌ కేటాయింపు చేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని గుర్తు చేశారు.. నేతన్నలకు యార్న్‌ సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం కూడా తమదేనన్నారు.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్‌కి కనిపించలేదా అని ప్రశ్నించారు..

ముంబై, భివండి, సూరత్‌ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకు కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా అని నిలదీశారు.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని ఏ నేతన్నను అడిగినా చెబుతారన్నారు కేటీఆర్‌. కేంద్రం బీమా ఎత్తివేస్తే తాము ప్రత్యేక బీమాను కల్పిస్తున్నామని గుర్తు చేశారు. చేనేత కార్మికుల సంక్షేమంపై నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయన్నారు..

కేవలం కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల దేశంలోనే వ్యవసాయ రంగం తరువాత అత్యధిక మందికి ఉపాధినిచ్చే టెక్స్‌టైల్‌ రంగంలో ఉపాధి కల్పన జరగని పరిస్థితిని బండి సంజయ్ తెలుసుకుంటే మంచిదన్నారు.. టెక్స్‌టైల్‌ ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ పన్ను వాసులు చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీది కాదా అని ప్రశ్నించారు.. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి చేనేత రంగంపై పన్నులు మోపిన పాపపు ప్రభుత్వం మీదేనంటూ కౌంటర్‌ ఇచ్చారు..

ఇదే జీఎస్టీ తగ్గించాలని, చేనేతపైన జీఎస్టీని సంపూర్ణంగా ఎత్తివేయాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశంలోని నేతన్నల ఉసురు తీస్తూ, పరిశ్రమను సంక్షోభంలోకి నెడుతూ, మరోవైపు పరిశ్రమను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్న మమ్మల్ని విమర్శించే మీ వైఖరికి ఊసరవెల్లులు సైతం సిగ్గు పడుతున్నాయంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు కేటీఆర్‌..

కపట పాదయాత్రలో నేతన్నల కోసం పాటుపడుతున్న తమ ప్రభుత్వంపైన విమర్శలు చేసే బదులు ధైర్యం ఉంటే ఢిల్లీలో ప్రధానమంత్రి నిలదీసి, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక టెక్స్టైల్ పార్కును సాధించి తీసుకువచ్చే దమ్ము ఉందా అంటూ బండి సంజయ్‌ని నిలదీశారు. ఇప్పటికైనా నేతన్నలపై అభిమానం, ప్రేమ ఉంటే తమ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే మంచిదని సూచించారు. అసత్యాలతో మోసం చేయాలని చూస్తే రాష్ట్రంలోని నేతన్నలు బీజేపీ నేతలకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు కేటీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story