హైదరాబాద్‌లో మార్కెట్లు ఫుల్‌ రష్‌.. ఇలాగైతే తప్పదు భారీమూల్యం..!

హైదరాబాద్‌లో మార్కెట్లు ఫుల్‌ రష్‌.. ఇలాగైతే తప్పదు భారీమూల్యం..!
ఇవాళ GHMC పరిధిలో శానిటేషన్‌ డ్రైవ్‌ను మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కట్టడికి ఇవాళ్టి నుంచి 4 రోజులు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలు, మార్కెట్లలో డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ చేస్తూ వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ GHMC పరిధిలో శానిటేషన్‌ డ్రైవ్‌ను మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో 24 గంటల్లో 5 వేల 93 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ప్రస్తుతం 37 వేల 37 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 743 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 488 కేసులు వస్తే, రంగారెడ్డి జిల్లాలో 407, సంగారెడ్డిలో 232 కేసులు ఉన్నాయి. రోజువారీకేసుల్లో సగానికి సగం గ్రేటర్ చుట్టుపక్కలే నమోదవుతున్న నేపథ్యంలో.. నియంత్రణ కష్టంగా మారింది.

అటు, కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నా మార్కెట్లలో రద్దీ తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నాన్‌వెజ్ మార్కెట్లలో చాలా మంది కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కూరగాయల మార్కెట్లోనూ ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తేనో, మీడియా విజువల్స్ తీస్తుంటేనో హడావుడిగా మాస్క్‌లు పెట్టుకుంటున్నారు. చేతులారా వారు లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోవడమే కాదు.. మిగతా వాళ్ల ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారికి వెయ్యి జరిమానా విధిస్తున్నా కొందరు మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story