విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచ‌న లేదు : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచ‌న లేదు : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి
ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వచ్చే నాలుగేళ్లలో 3లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

నాలుగో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కం, ఎల‌క్ట్రానిక్ త‌యారీ పరిశ్రమ, మైనార్టీల‌కు రుణ ప‌థ‌కం, న‌ర్సంపేట్ – కొత్తగూడ రోడ్డు, టీఎస్ బీపాస్, బీపీఎల్ కుటుంబాల‌కు రేష‌న్ కార్డుల జారీపై స‌భ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖ‌ల మంత్రులు స‌మాధానం ఇచ్చారు.

ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వచ్చే నాలుగేళ్లలో 3లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 250కు పైగా కంపెనీల్లో ఎలక్ట్రానిక్ రంగంలో లక్షా 60వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని.. వచ్చే నాలుగేళ్లలో 75వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

టీఎస్ బీపాస్ విధానం ద్వారా.. 75 చ‌ద‌ర‌పు గ‌జాల వ‌ర‌కు ఎలాంటి అనుమ‌తి అవ‌స‌రం లేదన్నారు మంత్రి కేటీఆర్. 600 చ‌ద‌ర‌పు గ‌జాల వ‌ర‌కు 10 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు తక్షణ భ‌వ‌న అనుమ‌తిని ద‌ర‌ఖాస్తుదారుని స్వయం ధృవీక‌ర‌ణ ఆధారంగా ఇస్తామని.. 10 మీట‌ర్లకు పైబడి ఎత్తు క‌లిగిన భ‌వ‌నాల‌కు 21 రోజుల్లో అనుమ‌తి ఇస్తామన్నారు. ఈ విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన 100 రోజుల్లో 12 వేల 943 భ‌వ‌నాల‌కు అనుమ‌తులు జారీచేశామన్నారు మంత్రి కేటీఆర్.

మరోవైపు రాష్ర్టంలో విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచ‌న లేద‌ని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పష్టం చేశారు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో.. విద్యుత్ సంస్థలకు న‌ష్టాలు వచ్చాయని... అయినప్పటికీ విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచ‌న లేద‌ని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక మూడు నెల‌లు వ‌రుస‌గా రేష‌న్ బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా రేష‌న్ కార్డు ర‌ద్దవుతుంద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్పష్టం చేశారు. తెల్ల రేష‌న్ కార్డుల కోసం 9లక్షల 41వేల 641 ద‌ర‌ఖాస్తు చేసుకుంటే.. ఇందులో 3లక్షల 59వేల 974 మందికి ఆహార భ‌ద్రతా కార్డులు జారీ చేశామ‌న్నారు. రాష్ట్రంలో సుమారు 80 శాతం మందికి రేషన్ కార్డులున్నాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story