ఉగాది నుంచి గ్రేటర్‌ వరంగల్‌లో ప్రతిరోజు తాగునీటి సరఫరా : మంత్రి కేటీఆర్‌

ఉగాది నుంచి గ్రేటర్‌ వరంగల్‌లో ప్రతిరోజు తాగునీటి సరఫరా : మంత్రి కేటీఆర్‌
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు.

వరంగల్ నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు ప్రజలకి అందించే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఉగాది నుంచి నగర పరిధిలో తాగునీరు ప్రతిరోజు అందించేలా ముందుకుపోవాలని, ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతుల పనులను మరింత వేగవంతం చేయాలని కేటీఆర్‌ సూచించారు.

వరంగల్‌లో గతంలో 14వందల కిలోమీటర్ల పైపులైన్లు ఉంటే దీనికి అదనంగా ఇప్పటికే 1400 కిలోమీటర్లు పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిందని, దీంతో పాటు మరో 500 కిలోమీటర్ల పైప్ లైన్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు కేటీఆర్‌. తాగునీటి సరఫరా బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా 2048 వరకు వరంగల్ నగర ప్రజల తాగునీటి డిమాండ్‌ను తట్టుకునేలా రూపొందించడం జరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

వరంగల్ నగరంలో సుమారు లక్షా 70 వేల గృహాలకు నల్లా కనెక్షన్ ఉన్నాయని మిగిలిన గృహాలకు కూడా సాధ్యమైనంత త్వరగా కనెక్షన్లు ఇచ్చేలా, నల్లా కలెక్షన్లను ఒక రూపాయికి తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న సుమారు 3వేల 700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పురోగతిని కూడా మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సమీక్షించారు.

ఇప్పటికే దాదాపు ఎనిమిది వందల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మెజారిటీ ఇండ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకునే దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్, నగర కమిషనర్‌లు మంత్రికి తెలియజేశారు. త్వరలోనే పూర్తయిన 800 ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story