నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ప్రతిపక్షాలకు తలసాని సవాల్‌.. !

నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ప్రతిపక్షాలకు తలసాని సవాల్‌.. !
తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరేళ్లలో లక్షా 33వేల 999 ఉద్యోగాలను భర్తీ చేసిందని తలసాని చెప్పుకొచ్చారు. ఇది అబద్దమని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌ కౌంటర్ వేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. దీనిపై మంత్రి తలసాని ఘాటుగా స్పందించారు. ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా అని వ్యాఖ్యానించారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో విఫలమైతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసిందని తలసాని అన్నారు.

మంత్రి తలసానిపై దాసోజు శ్రవణ్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడితే తాము గొట్టం గాళ్లమా అని ఫైర్ అయ్యారు. ఆకు రౌడీ అయిన ఆలుగడ్డల శ్రీనివాస్‌తో తనను కేటీఆర్ తిట్టించారని, ఇది సరికాదని అన్నారు. సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నందుకే సవాల్‌ విసిరానని చెప్పుకొచ్చారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తలసాని ఒక రాజకీయ భిక్షగాడు అని శ్రవణ్ కామెంట్ చేశారు. చెంచాగిరి చేసే తలసానికి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్న కేటీఆర్ వ్యాఖ్యలు అబద్ధాలు అన్నారు దాసోజు శ్రవణ్. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా దిగిపోయే నాటికి లక్షా 30వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. తాను చెప్పేది తప్పని గన్ పార్క్‌కు వచ్చి కేటీఆర్ నిరూపించాలని సవాల్‌ విసిరారు. నిరూపిస్తే అక్కడికక్కడే గొంతు కోసుకుని చచ్చిపోతానని చెప్పారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరేళ్లలో లక్షా 33వేల 999 ఉద్యోగాలను భర్తీ చేసిందని తలసాని చెప్పుకొచ్చారు. ఇది అబద్దమని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌ కౌంటర్ వేశారు. ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకవేళ నిరూపించకపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని మంత్రి సవాల్‌ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story