సాగర్‌ పోరులో ముగిసిన నామినేషన్ల ఘట్టం.. !

సాగర్‌ పోరులో ముగిసిన నామినేషన్ల ఘట్టం.. !
నాగార్జునసాగర్‌ ఉపసమరం హోరాహోరీగా సాగుతోంది. సాగర్‌ పోరులో ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది.

నాగార్జునసాగర్‌ ఉపసమరం హోరాహోరీగా సాగుతోంది. సాగర్‌ పోరులో ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులతోపాటు పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. 32 మంది అభ్యర్థులు 40కి పైగా సెట్ల నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 3, బీజేపీ 3, టీడీపీ తరపున 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ సాదాసీదాగా సాగింది.

టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భ‌గ‌త్ కుమార్ నిడ‌మ‌నూరు ఆర్వో కార్యాల‌యంలో నామినేషన్‌ వేశారు. నోముల భగత్‌తో కలిసి మంత్రులు మ‌హ‌మూద్ అలీ, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. టికెట్‌ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు నోముల భగత్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నోముల భగత్‌ చెప్తున్నారు.

అటు కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి జానారెడ్డి కూడా నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. సాగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం ఇది పదకొండోసారి. కార్యకర్తలతో ర్యాలీగా తరలివెళ్లిన ఆయన రిటర్నింగ్‌ అధికారికి పత్రాలు సమర్పించారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి.. గడప గడపకు చేరిన పథకాలే తనని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న జానారెడ్డి.. సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రలోభాలు వద్దు.. ఓటర్లను స్వేచ్ఛగా ఓటేయనివ్వండంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. కేవలం కర పత్రంతోనే ప్రచారం చేద్దామని ఆయన ప్రతిపాదించారు.

మరోవైపు.. అనూహ్యంగా బీజేపీ టికెట్ దక్కించుకున్న డాక్టర్ పానుగోతు రవి నాయక్‌ చివరి నిమిషంలో నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ వేసే ముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో జనరల్‌ సీటును తనకు కేటాయించినందుకు పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు జీవితాంతం రుణపడి ఉంటాటనని రవినాయక్‌ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎస్టీ సామాజికవర్గం ఓట్లు నూటికి నూరు శాతం తనకే పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కుందూరు జానారెడ్డి రాచరిక పాలన చేశారని.. అధికార పార్టీ ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలని రవినాయక్‌ కోరారు.

మరోవైపు బీజేపీలో సాగర్‌ ఉప ఎన్నిక చిచ్చు రాజేసింది.. అసంతృప్త జ్వాలలు రేపింది. చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్‌ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే నామినేషన్‌ వేసిన మరో అభ్యర్థి నివేదిత రెడ్డి కూడా నాయకత్వంపై అలకబూనినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగియడంతో.. పార్టీలన్నీ ప్రచారంపై సీరియస్‌గా దృష్టి సారించాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story