తెలంగాణలో కరోనా కేసుల కట్టడికి ఇకపై కఠినంగా నిబంధనలు అమలు

తెలంగాణలో కరోనా కేసుల కట్టడికి ఇకపై కఠినంగా నిబంధనలు అమలు
తెలంగాణలో లాడ్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూపై వస్తున్న వదంతులను సీఎస్‌ సోమేష్ కుమార్‌ కొట్టిపడేశారు.

కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో.. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించకపోయినా, ఉమ్మి వేసినా.. వాళ్లను నేరుగా కోర్టులో హాజరుపరచనున్నారు. విపత్తు నిర్వహణ చట్టంతోపాటు IPC సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తారు. అటు, జనం గుమికూడి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్సవాలు, వేడుకలపై కూడా ఆంక్షలు విధించారు.ఈ నెలాఖరు వరకూ ఈ రూల్స్ అమల్లో ఉంటాయని పోలీసు శాఖ స్పష్టం చేసింది. అటు.. తెలంగాణలో కరోనా కేసులు పెరిగినా వాటిల్లో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు కనిపించలేదు. ఈ కోవిడ్ వైరస్‌లో రెండు మూడు రకాల మ్యూటేషన్లు ఉన్నా ఆ లక్షణాలు ఇక్కడి కేసుల్లో లేవని వైద్యఆరోగ్యశాఖ చెప్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజు 50 నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నారు. అవసరమయితే ఈ సంఖ్య మరింత పెంచుతామని చెప్తున్నారు. ట్రేసింగ్.. టెస్టింగ్‌.. ట్రీట్‌మెంట్‌కి ప్రాధాన్యమిస్తూనే ముందుకు వెళ్తున్నామంటున్నారు.

తెలంగాణలో లాడ్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూపై వస్తున్న వదంతులను సీఎస్‌ సోమేష్ కుమార్‌ కొట్టిపడేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన జీవో కాపీ నకిలీదని.. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి రకమైన లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. రాత్రివేళ దుకాణాల మూసివేత కూడా తప్పుడు ప్రచారమని సీఎస్‌ తెలిపారు.

అటు, ఆస్పత్రుల్లో అవసరమైన మేరకు PPE కిట్లు, ఆక్సిజన్ సిలెండర్లు సహా ఇతర వైద్య సామాగ్రి అన్నీ అందుబాటులో ఉన్నాయని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించి తాజా పరిస్థితి తెలుసుకున్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా తీవ్రత పెరుగుతుందని తెలిసినా కొందరు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం లేదు. ఇలాంటి వారిలో అవగాహన పెంచేందుకు GHMC పరిధిలో ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టనున్నారు. ఆఫీసులతో పాటు, పబ్లిక్ ప్లేస్‌లలో మాస్కు తప్పనిసరి చేస్తూ ఇప్పటికే బల్దియా ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో అందరూ కచ్చితంగా రెండు గజాల దూరాన్ని పాటించాలని పేర్కొంది. ఎయిర్ కండీషన్లు, కూలర్ల వినియోగం తగ్గించాలని కూడా సూచించింది. GHMC కార్యాలయాలు, సెక్షన్లలోకి సందర్శకులకు అనుమతి నిలిపేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారికి జరిమానాలు కూడా విధిస్తారు. ఇక ఆఫీస్‌లు, మాల్స్ సహా అన్నిచోట్లా ప్రవేశద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని కూడా GHMC అధికారులు స్పష్టం చేశారు. సందర్శకులు అధికంగా వచ్చే కార్యాలయాలు, విభాగాల్లోని డోర్లు, హ్యాండిళ్లు, రాడ్‌లను తరచుగా శానిటైజ్‌ చేయాలన్నారు.

ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి మెట్లపై వెళ్లాలని సర్క్యులర్‌లో పేర్కొంది. అత్యవసరమైతే తప్ప GHMCలో ఫైళ్లన్నింటిని ఈ-ఆఫీస్ ద్వారానే క్లియర్ చేయనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story