అమ్మకు ఆగని దుఃఖం.. శివయ్యకు 'తల'కు మించిన భారం..

అమ్మకు ఆగని దుఃఖం.. శివయ్యకు తలకు మించిన భారం..
అయ్యో భగవంతుడా.. పిల్లలు లేకపోతే ఒకటే నిశ్చింత.. కానీ పుట్టించిన వాడికి ఇన్ని బాధలు ఎందుకు పెడతావు నాయినా అని ఆక్రోశిస్తున్నారు.. బాధపడుతున్న ఆ చిన్నారిని చూసి కన్నీరు పెడుతున్నారు.

నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి పడ్డ కష్టమంతా మరిచిపోతుంది మాతృమూర్తి పొత్తిళ్లలో ఉన్న బిడ్డను చూసుకుని.. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. ఆరోగ్యంగా ఉంటే అమ్మానాన్న ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఆ బిడ్డ తలకు మించిన భారం అవుతాడని నిరుపేద కుటుంబం ఊహించలేకపోయింది. అయ్యో భగవంతుడా.. పిల్లలు లేకపోతే ఒకటే నిశ్చింత.. కానీ పుట్టించిన వాడికి ఇన్ని బాధలు ఎందుకు పెడతావు నాయినా అని ఆక్రోశిస్తున్నారు.. బాధపడుతున్న ఆ చిన్నారిని చూసి కన్నీరు పెడుతున్నారు.

నీ కడుపులో కవల పిల్లలు ఉన్నారు జాగ్రత్త.. మంచి ఆహారం తీసుకో.. నువు తీసుకునే ఆహారం ఇద్దరికి అందాలని డాక్టర్ చెబితే తలాడించింది.. కానీ పుట్టిన బిడ్డ తల నిలప లేక పోతున్నాడని.. అతడి తల రోజు రోజుకి పెరిగి పోతోందని రోదిస్తోంది ఆ తల్లి.. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లినా వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారని వాపోతోంది.

ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీకాంత్, హారిక 2016 మార్చి 1న ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. నెలలు నిండక ముందే జన్మించిన ఇద్దరిలో ఒకరు అనారోగ్య కారణాలతో 41 రోజులకే కన్నుమూశాడు. మిగిలిన ఒక్కడినైనా ప్రేమగా చూసుకోవాలనుకున్నారు. కానీ వారి ఆశ అడియాసే అయింది. అనుకోని ఆపద వచ్చి పడింది.

ముద్దుగా శివయ్య (శివ) అని పిలుచుకునే ఆ చిన్నారికి అయిదో నెల నుంచే తల భాగం అనూహ్యంగా పెరగడం ప్రారంభమైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. ఎంత మంది డాక్టర్లు చూసినా, మందులు వాడినా ప్రయోజనం కనిపించలేదు.. ఆపరేషన్ చేయడానికి కూడా వీలుకాని పరిస్థితి అని వైద్యులు వివరించారు. ఉన్నన్ని రోజులు బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడం తప్పించి మరో మార్గం లేదని చెప్పారు.

శివయ్యకు అన్నీ సమస్యలే..

ఒకటి, రెండూ అయితే వైద్యులు చికిత్స చేసేవారు. కానీ శివయ్యకు అన్నీ సమస్యలే.. ఆ బిడ్డ ఏం పాపం చేసుకున్నాడు.. పుట్టి పుట్టగానే ఇంత కష్టం అనుభవిస్తున్నాడు అని ఇరుగు పొరుగు వారు శివయ్యను చూసి బాధపడుతుంటారు. అయిదేళ్ల ఆ చిన్నారికి తల భారంతో పాటు, కళ్లు సరిగా కనిపించవు.. కాళ్లు, చేతులు సక్రమంగా పని చేయవు. నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బాబుని ఎత్తుకోవడం, పడుకోబెట్టడం చేస్తున్నారు. ఆహారం కూడా ద్రవ రూపంలో అందిస్తేనే జీర్ణం అవుతుంది. ఇందుకు కుటుంబసభ్యులు అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతాన్ని తినిపిస్తున్నారు. ఇదే ప్రతి రోజూ ఆ బాలుడి ఆహారం. జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నారని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

శ్రీకాంత్, హారిక దంపతులకు మరో సంతానంలో బాబు పుట్టాడు. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. అమ్మమ్మ శివయ్య బాగోగులు చూసుకుంటోంది. శివయ్యకు ప్రభుత్వం అందించే దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని తండ్రి శ్రీకాంత్‌తో పాటు అమ్మమ్మ లక్ష్మి ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో అధికారులు స్పందించి పించను అందిలే చూస్తామన్నారు. మనసున్న మారాజులు ఎవరైనా సాయం చేయాలని కుటుంబం వేడుకుంటోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 75691 44233.

Tags

Read MoreRead Less
Next Story