Telangana: అప్పుల విషయంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య గొడవలు..

Telangana: అప్పుల విషయంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య గొడవలు..
Telangana: అప్పులపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజూ తగువు జరుగుతూనే ఉంది.

Telangana: అప్పులపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజూ తగువు జరుగుతూనే ఉంది. కార్పొరేషన్ల రుణాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం, గత రెండేళ్లలో తీసుకున్న రుణాలను సైతం లెక్కిస్తామని కేంద్రం చెబుతుండడంతో.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. నెలన్నరగా అప్పు పుట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం. కనీసం బాండ్లు అమ్ముకుని రుణం తెచ్చుకోడానికి కూడా కేంద్రం నుంచి అనుమతి లభించడం లేదు.

ఈ పరిస్థితుల్లో అప్పులపై కేంద్రం ఆంక్షలు సడలించకపోతే గనక.. తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి పనులు నిరర్థకం అవుతాయంటూ కేంద్రానికి ఓ లేఖ రాసింది రాష్ట్ర ఆర్థిక శాఖ. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం తెలంగాణకు 42వేల 728 కోట్ల మార్కెట్‌ రుణానికి మాత్రమే అనుమతి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 59వేల 672 కోట్ల రుణాలకు అనుమతి అడిగింది.

ఇవి కాకుండా సాగు-తాగు నీటి ప్రాజెక్టులు, ఇతరత్రా అవసరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా మరో 40 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్‌కే 30 వేల కోట్ల అవసరం ఉంది. తాగునీటి సరఫరా సంస్థకు 2వేల 832 కోట్లు, నీటివనరుల అభివృద్ధి సంస్థకు 2వేల 315 కోట్ల అప్పు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో అమలవ్వాలంటే అప్పులు తీసుకోవాల్సిందే.

జీతాలు, చెల్లింపులు సకాలంలో చేయాలన్నా సరే అప్పు తప్పనిసరి. నెలన్నరగా ఏ రూపంలోనూ అప్పు పుట్టకపోవడంతో అభివృద్ధి, సంక్షేమం, సాగు, తాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. రుణాలపై ఆంక్షలు విధించడం సరికాదని కేంద్రంపై మండిపడుతోంది. గతంలో ఎలాగైతే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి బాండ్ల ద్వారా అప్పులు తెచ్చుకున్నామో, ఇప్పుడూ అదే పద్దతిలో అప్పులకు అనుమతించాలని కోరింది.

బడ్జెట్‌ వెలుపల తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా పాత విధానం కొనసాగించాలంటూ లేఖ రాసింది. అసలు రుణాలపై ఇప్పటికిప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చి, గతంలో తీసుకున్న అప్పులను ఇప్పుడు లెక్కిస్తామనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. దీనికి కేంద్రం నుంచి ఎలాంటి రిప్లై వస్తుందా అని ఎదురుచూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story