Narasimha Rao : ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు కన్నుమూత

Narasimha Rao : ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు కన్నుమూత
Narasimha Rao : ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక, మనో విశ్లేషకులు సి.నరసింహారావు కన్నుమూశారు.

Narasimha Rao : ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక, మనో విశ్లేషకులు సి.నరసింహారావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. రాత్రి ఒంటి గంటా 50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 ఏళ్లు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజకీయ, సామాజిక విశ్లేషకుడిగా పేరొందిన నరసింహారావు.. వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాశారు.

టీవీ5 ప్రారంభం నుంచి దాదాపు 14 ఏళ్లుగా వార్తల విశ్లేషణ కార్యక్రమంలో సి.నరసింహారావు పాలుపంచుకున్నారు. రోజూ ఉదయం ప్రసారం అయ్యే న్యూస్‌ స్కాన్‌ చర్చా కార్యాక్రమంలో ప్రతి గురువారం ఆయన క్రమం తప్పకుండా పాల్గొని, వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసేవారు. సి.నరసింహారావు మృతి పట్ల టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు సంతాపం ప్రకటించారు. జర్నలిస్టుగా సమాజంలోని అన్ని కోణాల్ని నిశితంగా పరిశీలించిన ఆయన.. వాటిపై తనదైన విశ్లేషణలతో పేరు తెచ్చుకున్నారని అన్నారు.

విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు సి.నరసింహారావు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. పాత్రికేయరంగానికి ఆయన మరణం తీరని లోటని జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి. సి.నరసింహారావు స్వస్థలం కృష్ణా జిల్లా పెదపాలపర్రు. 1948 డిసెంబర్ 29న జన్మించిన ఆయన.. అనారోగ్యం కారణంగా కన్నుమూయడంతో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story