పదవులకు ఫస్ట్, ప్రచారానికి లాస్ట్.. టీ-కాంగ్రెస్ నేతలపై విమర్శలు

పదవులకు ఫస్ట్, ప్రచారానికి లాస్ట్.. టీ-కాంగ్రెస్ నేతలపై విమర్శలు
కాంగ్రెస్‌ సీనియర్ల వ్యవహారాన్ని భరించలేని కొందరు నేతలు.. నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికే రెడీ అయ్యారు.

పదవులకు ఫస్ట్, ప్రచారానికి లాస్ట్ అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. పార్టీలో పదవుల కోసం పోటీ పడే నేతలు.. పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కష్టకాలంలో అందరూ కలిసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాల్సిన నేతలు.. ఇప్పటికీ అంటీఅంటనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్ల వ్యవహారాన్ని భరించలేని కొందరు నేతలు.. నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికే రెడీ అయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్‌ఎస్‌, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు ఈ రెండు పార్టీల మధ్యే జరుగుతున్నాయి. ప్రచారంలో దూకుడుగా ఉండాల్సిన కాంగ్రెస్‌ మాత్రం ఆ స్థాయి పర్ఫామెన్స్‌ చూపించడం లేదనే విమర్శ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో తామే సీనియర్లం అని చెప్పుకునే వాళ్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదని సొంత పార్టీ వాళ్లే చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీపడిన నేతలు.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కనిపించకుండా పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో రాములు నాయక్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఆయన పక్షాన ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే విస్తృత ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజక వర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని పోటీకి పెట్టింది. అక్కడ మాత్రం సీనియర్లు ఎవరూ కనిపించడం లేదు. ఎంపీ రేవంత్‌రెడ్డి సర్వం తానై వ్యవహరిస్తూ ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, పొన్నం ప్రభాకర్ వంటి నేతలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. పార్టీ పరువు దక్కాలంటే ఐక్యంగా పనిచేయాల్సిన నాయకులు ఎన్నికల సమయంలో పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, వీహెచ్, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, మధుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు ఇప్పటి వరకు పెద్దగా ప్రచారంలో కనిపించడం లేదన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. అక్కడక్కడ కనిపించినా వీరంతా పూర్తి స్థాయిలో కలిసిరావడం లేదన్న చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదట్లో ప్రచారానికి వెళ్లినా… ఆ తర్వాత దూరంగానే ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

వరంగల్ సెగ్మెంట్‌లో రాములు నాయక్, హైదరాబాద్ సెగ్మెంట్‌లో చిన్నారెడ్డి గెలుపుపై ఆశలు పెట్టుకున్నా.. సొంత పార్టీ నేతల వైఖరి అభ్యర్థులకు తలనొప్పిగా మారినట్లు వారి అనుచరులు చెబుతున్నారు. ఈ రెండు సెగ్మెంట్ల పరిధుల్లో కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నప్పటికీ.. ఉత్తమ్ మినహా మిగతా నేతలు ప్రచారానికి హాజరుకావడం లేదట. జానారెడ్డి పూర్తిగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల మీదే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు.

టీపీసీసీ పీఠం కోసం పోటీపడిన జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి సైతం పట్టించుకోవడం లేదట. కేరళ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా ఎంపిక చేయడంతో దుద్దిళ్ల శ్రీధర్ బాబు అక్కడి అభ్యర్థుల ఎంపిక మీద దృష్టిపెట్టారు. ప్రచారానికి సహకరించని మిగిలిన నేతలపై అభ్యర్థులు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఉత్తమ్ సైతం ఠాగూర్‌ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సైకిల్ యాత్ర ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story