హైదరాబాద్‌లో మరోరెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం!

హైదరాబాద్‌లో మరోరెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం!

హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. చెరువు కట్టలు తెగిపోవడంతో చాలా కాలనీల్లోకి చేరిన నీరు ఇంకా వెళ్లడం లేదు. మూసీ ప్రవాహ ఉధృతికి లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూనే గడుపుతున్నారు. అంబర్‌పేటలోని బాపునగర్‌ నీటిలోనే చిక్కుకుపోయింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో పాటు డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతోంది. చాలా ఇళ్లు మోకాలి నీటిలోనే ఉన్నాయి. పాములు, కప్పలు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పాతబస్తీలోని బేలా కమాన్‌ వరద ధాటికి కుప్పకూలింది. శిథిలావస్థకు చేరిన కమాన్‌.. ఇటీవలి వర్షాలకు మరింత బలహీనంగా మారింది. అటు.. బేలా కమాన్‌కు దగ్గరలోనే మంత్రులు మూసీనదికి పూజలు నిర్వహించారు. మంత్రుల రాక సందర్భంగా ట్రాఫిక్‌ ఎక్కువ కావడంతో.. అధికారులు బేలాకమాన్‌ దారిలో రాకపోకలు నిలిపివేశారు. మంత్రుల కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే కమాన్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. అధికారులు రాకపోకలు నిషేధించడంతో ప్రాణ నష్టం తప్పింది.

నల్లకుంట పద్మాకాలనీలో వరద బాధితులు ఆందోళన నిర్వహించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మించిన కట్టడాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. నాలా బాధితుల సంఘం ఆధ్వర్యంలో పద్మాకాలనీ, ఓల్డ్‌ రామాలయం, నాగమయ్యకుంటలో ప్రజలు.. అక్రమణల్ని పరిశీలించారు. నాలా కబ్జాల్ని తొలగించి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని నినాదాలు చేశారు. గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముంపు ప్రాంతాల్ని పరిశీలించినా ఫలితం లేదని కాలనీ వాసులు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి.. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

వరద బాధితులకు బోట్ల సాయంతో అధికారులు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ టూరిజం శాఖ బోట్లను ఏర్పాటు చేసింది. వరద బాధితుల్లో మంత్రి కేటీఆర్‌ భరోసా నింపుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా అవస్థలు పడుతున్న బాధితులను పరామర్శిస్తున్నారు. హైదరాబాద్‌లోని నల్లకుంట డివిజన్‌లోని రత్న నగర్‌, సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌ ప్రాంతాల్లో కేటీఆర్‌ పర్యటించారు. ముంపునకు గురైన బాధితుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబానికి ఇంటికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. రత్ననగర్‌ ముంపునకు కారణమైన నాలాకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

మరోరెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్ష సూచనల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువులన్నీ నిండినందున నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు. హైదరాబాద్‌లోని అన్ని చెరువుల పరిస్థితిని 15 బృందాలు నిరంతరం పరిశీలించాలని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుల్ని గుర్తించి... ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్కడైనా గండ్లు పడినా... కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మత్తులు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేసి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు దాదాపు 10 వేల కమ్యూనిటీ సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా రోడ్లపైకి వరద నీరు వచ్చినా... ట్రాఫిక్ జామ్‌ అయినా... వెంటనే గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. స్థానిక పోలీసులు వెంటనే నగర ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదం జరుగకుండా చర్యలు చేపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story