కమలదళంలో రేవంత్‌ గుబులు..?

కమలదళంలో రేవంత్‌ గుబులు..?
చాలా త‌ర్జనభ‌ర్జన‌ల మ‌ధ్య టీపీసీసీ పీఠాన్ని ద‌క్కించుకున్న రేవంత్ రెడ్డి... ప‌ద‌వి ద‌క్క‌గానే పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు.

చాలా త‌ర్జనభ‌ర్జన‌ల మ‌ధ్య టీపీసీసీ పీఠాన్ని ద‌క్కించుకున్న రేవంత్ రెడ్డి... ప‌ద‌వి ద‌క్క‌గానే పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఓ వైపు పార్టీని చ‌క్క‌దిద్ద‌డంతో పాటు ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అటు.. టీఆర్ఎఎస్, ఇటు బీజేపీ ఆప‌రేష‌న్ఆ క‌ర్ష్‌తో ముఖ్య‌నాయ‌కుల‌తో మంత‌నాలు సాగించార‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇక... రేపో మాపో ఆయా పార్టీలో నేత‌లు చేరిపోతార‌న్న వార్తలు కూడా వ‌చ్చాయి. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ కేడ‌ర్‌లో జోష్ నింపేందుకు యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నారు.

మరోవైపు... పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన నేత‌ల‌్ని తిరిగి పార్టీలో చేర్చుకోవ‌డంతో పాటు.. ఇత‌ర పార్టీలో అంతృప్తితో ఉన్న వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించ‌డంపై రేవంత్‌ దృష్టి పెట్టారు. తద్వారా పార్టీలో సానుకూల వాతావ‌ర‌ణం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు టీఆర్ఎస్‌ను ట‌చ్ చేయ‌ని రేవంత్.... బీజేపీ టార్గెట్‌గా పావులు క‌దుపుతున్నారు. తాను టీడీపీలో ఉన్న స‌మ‌యంలో... త‌నతో పాటు ప‌నిచేసి.. ఇప్పుడు బీజేపీలో చేరిన నేత‌ల్ని కలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారు, వెళ్లాల‌నుకున్న వారితో భేటీ అవుతున్నారు. రేవంత్ బాద్య‌త‌లు తీసుకున్న మ‌రుస‌టి రోజే... బీజేపీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. భూపాలప‌ల్లిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర స‌త్యానారాయ‌ణ‌... రేవంత్‌తో భేటీ అయ్యారు. వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరికపై ప్రచారం జరిగిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్‌ మంతనాలు జరిపారు. టీడీపీ సీనియ‌ర్ నేత దేవేందర్‌గౌడ్, ఆయ‌న కుమారుడు బీజేపీ నేత వీరేంద‌ర్‌గౌడ్‌తో ఇంటికి వెళ్లి మాట్లాడారు.

అయితే... రేవంత్ వ్య‌వ‌హారాన్ని ఎప్ప‌టికప్పుడు గ‌మ‌నిస్తున్న బీజేపీ నేత‌లు... ఆయ‌నను లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తున్నారు. కొత్త‌గా అద్య‌క్షుడైన రేవంత్ త‌నను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప‌డుతున్న తాపత్ర‌య‌మే త‌ప్ప... మరేమీ లేదంటూ కొట్టి పారేస్తున్నారు. ఒకరో ఇద్ద‌రో కాంగ్రెస్‌లోకి పోయినంత మాత్ర‌న... బీజేపీకి వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వ‌మే వస్తుందని, కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల‌ు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని చెబుతున్నారు. ప్ర‌త్యామ్నాయంగా బీజేపీనే చూస్తున్నాని అంటున్నారు. కానీ... రేవంత్‌ వ్యవహారమైతే బీజేపీని కాస్త కలవరపెడుతున్నట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్‌ బీజేపీ టార్గెట్‌గా ఇంకా దూకుడు పెంచుతారా...? టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చాటుకునేలా... ఏం చేస్తారు..? అసలు వ్యూహమేంటి...? అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story