బావిలో పడిన జీపు.. అదృష్టవశాత్తు బయటపడ్డ 11 మంది

బావిలో పడిన జీపు.. అదృష్టవశాత్తు బయటపడ్డ 11 మంది

వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలంలో ప్రమాదం చోటు చేసుకుంది. గవిచర్ల వద్ద ఓ జీప్‌ అదుపుతప్పి బావిలో పడింది. ప్రమాద సమయంలో జీపులో 15మంది ఉన్నారు. ఐతే అదృష్టవశాత్తు పదకొండు మంది సురక్షితంగా బయటపడ్డగా.. ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతు అయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్‌ మృతి చెందాడు. మృతుడు ఏనుగల్లుకు చెందిన డ్రైవర్‌ సతీశ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నీటిలో పడిన జీపును క్రేన్‌ సాయంతో పోలీసులు వెలికితీశారు. ఘటనాస్థలిలో అగ్ని మాపక, రెవెన్యూ, ఎక్సైజ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వరంగల్‌ నుంచి ప్రయాణికులతో జీపు నెక్కొండకు బయల్దేరింది. వరంగల్‌ నగర శివారులోని గవిచర్ల దాటగానే జీపు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో వ్యవసాయ పనులు ముగించుకొని వస్తున్న రైతులు, కూలీలు వెంటనే అక్కడికి వెళ్లారు. బావిలోంచి ఈదుతూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తున్న 11 మందిని రక్షించారు.

గవిచర్ల ఘటనపై వరంగల్‌ గ్రామీణం కలెక్టర్‌, సీపీతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని వారిని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. రోడ్డు పక్కనున్న బావుల పట్ల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపయోగంలో లేని బావులు, బొందలు వెంటనే మూసివేయాలని.. ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story