Saroor Nagar: సరూర్‌నగర్‌లో పెంపుడు తల్లి హత్య కేసులో ట్విస్ట్.. నిందితుడు మృతి..

Saroor Nagar: సరూర్‌నగర్‌లో పెంపుడు తల్లి హత్య కేసులో ట్విస్ట్.. నిందితుడు మృతి..
Saroor Nagar: హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీటీకాలనీలో నివాసం ఉంటున్నారు భూదేవి.

Saroor Nagar: హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీటీకాలనీలో నివాసం ఉంటున్నారు భూదేవి. ఆమెకు పిల్లలు కలగేదు. దీంతో కొన్ని సంవత్సరాల క్రితం సాయితేజ అనే బాలుడిని దత్తత తీసుకొని అపురూపంగా పెంచి పెద్ద చేసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ దత్తపుత్రుడు మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ప్రతిరోజు డబ్బులు ఇవ్వమంటూ తల్లిని వేధించేవాడు. తల్లి నిరాకరించేది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బంగారం, నగదుపై కన్నేశాడు సాయితేజ.

తల్లి భూదేవి హత్యకు కుట్ర పన్నాడు. సాయితేజ తన స్నేహితుడు శివతో కలిసి ఈనెల 7న ఆమెను హత్య చేసి ఇంట్లో ఉన్న 35 తులాల నగలు, 10 లక్షల నగదు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చేసరికి భూదేవి రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు మాయమవడం, సాయితేజ కనిపించకపోవడంతో దుండగులు తల్లిని చంపి సాయితేజను కిడ్నాప్‌ చేసి ఉంటారని భావించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చుట్టపక్కల సీసీ కెమెరాలు పరిశీలించారు. సాయితేజ భుజానికి సంచితో నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించారు. అక్కడ లభించిన ఆధారాలతో దత్తపుత్రుడే హత్య చేసి బంగారు ఆభరణాలతో పారిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంతలోనే ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయిన సాయితేజ హత్యకు గురయ్యాడు. నల్లమల అడవుల్లోని ఈటలపెంట వద్ద సాయితేజ మృతదేహం గుర్తించారు.

అతన్ని స్నేహితుడు శివనే బండరాయితో కొట్టి చంపినట్లు మల్లెల తీర్థం నీటి గుండంలో పడేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరూ మద్యం సేవించారని.. ఆపై సాయిని చంపి డబ్బు, బంగారం శివ ఎత్తుకెళ్లాడని పోలీసులు అంటున్నారు. పుట్టిన మూడు రోజులకే సాయితేజను జంగయ్య, భూదేవి దంపతులు దత్తత తీసుకున్నారని బంధువులు తెలిపారు. అప్పటి నుంచి ఏది కావాలన్నా తెచ్చిపెట్టేవారన్నారు. కనికరం లేని ఆ కుమారుడు ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story