సెప్టెంబరు 1 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఈ వారంలో సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం..!

సెప్టెంబరు 1 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఈ వారంలో సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం..!
తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేందుకు కసరత్తు జరుగుతోంది. సెప్టెంబరు 1 నుంచి తిరిగి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది విద్యాశాఖ.

తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేందుకు కసరత్తు జరుగుతోంది. సెప్టెంబరు 1 నుంచి తిరిగి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది విద్యాశాఖ. దీనిపై ఈ వారంలో సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. తొలుత 8నుంచి ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యాలు, తల్లిదండ్రుల సంఘాలతో త్వరలో సమావేశాలు నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబరు నెలాఖరులో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కరోనా తీవ్రత కారణంగా వారికి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశారు. ఒకవేళ రెండో సంవత్సరం పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి వస్తే మార్కులు వేసేందుకు ప్రాతిపదిక ఉండదు కాబట్టి.. కచ్చితంగా మొదటి సంవత్సరం పరీక్షలు జరపాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించింది.

కరోనా ప్రభావంతో గత మార్చిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. మధ్యలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడంతో మళ్లీ ఆన్‌లైన్‌ బోధనకే పరిమితం చేశారు. గత నెల ఒకటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఈనెలలోనే విద్యాసంస్థలు తెరుస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 నుంచి ఆపై తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది.

Tags

Read MoreRead Less
Next Story