డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వద్దంది.. మంత్రి మనసు గెలుచుకుంది!

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వద్దంది.. మంత్రి మనసు గెలుచుకుంది!
డబుల్ బెడ్ రూమ్(Double Bedroom Houses ) అనే పధకాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఎంత సీరియస్ గా తీసుకుందో అందరికీ తెలిసిందే..

డబుల్ బెడ్ రూమ్(Double Bedroom Houses ) అనే పధకాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఎంత సీరియస్ గా తీసుకుందో అందరికీ తెలిసిందే. ఇళ్ళ నిర్మాణం పూర్తి అయిన వెంటనే మంత్రులు పేదవాళ్ళకి ఆ ఇళ్ళను మంజూరు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న సిద్ధిపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణి జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao) హాజరయ్యారు. లబ్దిదారులకి ఇళ్ళకి సంబంధించిన తాళాలను అందజేస్తున్న సమయంలో ఓ మహిళ తనకి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వద్దని తిరస్కరించింది. ముందుగా షాక్ అయిన మంత్రి హరీష్.. ఆ తర్వాత ఆ మహిళా చెప్పింది విన్నాక ఆమెకి శాలువ కప్పి సత్కారం చేశారు.

ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. సిద్దిపేట(Siddipeta)కు చెందిన రచ్చ లక్ష్మి అనే మహిళ భర్త కొన్నేళ్ళ క్రితం చనిపోయాడు. ప్రస్తుతం ఆమె, తన కూతురు కలిసి ఉంటున్నారు. భర్త చనిపోవడంతో లక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇల్లును మంజూరు చేసింది. అయితే ఆ ఇల్లు తనకి వద్దని లక్ష్మి తిరస్కరించింది. అయితే ఆ తర్వాత ఆమె చెప్పిన సమాధానం అక్కడ ఉన్న అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


" నా భర్త చనిపోయాడు.. ప్రస్తుతం నేను, నా కుమార్తె ఉంటున్నాం .. నా కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత నేను ఒంటరిగా ఉండాలి.. ఆలాంటి సమయంలో నాకు ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదు. నేను నా సోదరుల వద్ద ఉంటాను. అందుకే నేను ఈ ఇంటిని తిరిగి ఇచ్చేస్తున్నాను. దీనిని మరో పేద కుటుంబానికి అందిస్తే బాగుంటుంది" అని లక్ష్మి చెప్పుకొచ్చింది. నిజాయితీగా ఆమె చెప్పిన మాటలు విన్న మంత్రి హరీష్ రావు ఆమెను శాలువాతో కప్పి మరి సత్కరించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని మరికొందరు కూడా ముందుకు రావాలని సూచించారు. ఆమెకి, ఆమె కుటుంబానికి అన్నీ విధాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story