తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి..!

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి..!
మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌ తదితర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నారు. ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌ తదితర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 14 జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోనే నిన్న అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాలలో 43.5, నల్గొండలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌పై భానుడు భగ్గుమంటున్నాడు. ఈ సీజన్‌లో తొలిసారి నిన్న 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పగలు 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉంటున్నందున ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రాకుంటేనే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీలు అదనంగా పెరిగే సూచనలున్నాయని తెలిపారు. ఇంట్లో ఉక్కపోత, బయట ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇక.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పగటి ఉష్ణోగ్రతలు మరో మూడు రోజులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదువుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంటుంది. ఒక్కసారిగా పగటి ఉష్ణోగత్రలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతుండటంతో సూరీడు సుర్రుమంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story