నాగార్జున సాగర్‌ అభ్యర్ధిపై టీఆర్‌ఎస్ తర్జనభర్జన!

నాగార్జున సాగర్‌ అభ్యర్ధిపై టీఆర్‌ఎస్ తర్జనభర్జన!
వరుస ఎన్నికలతో అధికార పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అందులో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో గులాబీ నేతలు ఒత్తిడికి లోనవుతున్నారు.

వరుస ఎన్నికలతో అధికార పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆశించిన ఫలితాలు రాకపోవటంతో గులాబీ నేతలు గుబులు చెందుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న గులాబీ పార్టీకి రాబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కత్తి మీద సాములా కనబడుతున్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టాలనకునేలోపు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపినా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోవడంతో టీఆర్‌ఎస్‌లో గెలుపు గుర్రాన్ని అన్వేషించే పని పడింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయం వస్తోంది. కానీ దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడింది. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది.

నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది. సాగర్ నియోజకవర్గ నేత కోటిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కోటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరును తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎన్‌ఆర్‌ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కుతుందని టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల్లోనే రవీందర్ రెడ్డికి టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరిగినా సీనియర్ నాయకుడైన నోముల నర్సింహయ్యకు ఇచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ యాదవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేతను పార్టీలోకి తెచ్చి ఆయనకు లేదా ఆయన కుమారుడికి టికెట్ ఇస్తే గెలుపు సులభం అవుతుందని గులాబీ దళపతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీలోకి రాకపోతే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పోటీకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా టీఆర్‌ఎస్‌ చీఫ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బై పోల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సాగర్‌లో అభివృద్ధిపై టీఆర్‌ఎస్ ఫోకస్ చేసింది. అభ్యర్థి ఎవరైనా తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే వ్యూహాలను ఇప్పటికే అమలులో పెట్టింది. అధికార పార్టీ వ్యూహం ఎలా ఉన్నా అభ్యర్థి ఎంపిక కూడా కీలకం కానుంది. అయితే అభ్యర్థిని ముందే ఫైనల్ చేస్తారా లేక దుబ్బాకలో మాదిరిగా చివరి వరకు నాన్చుతారో చూడాలి మరి.

Tags

Read MoreRead Less
Next Story