బీజేపీ ఆఫీస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గంగుల శ్రీనివాస్‌ మృతి

బీజేపీ ఆఫీస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గంగుల శ్రీనివాస్‌ మృతి
హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గంగుల శ్రీనివాస్‌ మృతి చెందాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ నవంబర్ 1న..

హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గంగుల శ్రీనివాస్‌ మృతి చెందాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ నవంబర్ 1న బీజేపీ కార్యాలయం ఎదుట కార్యకర్త శ్రీనివాస్ పెట్రోల్ పోసుకుని నిప్పంచుకున్నాడు. పార్టీ కార్యాలయ సిబ్బంది, స్థానికులు మంటలు ఆర్పినా.. అప్పటికే శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం అతన్ని ముందుగా ఉస్మానియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. మంటలకు శరీరంలోని అవయవాలు దెబ్బతినడంతో.. డాక్టర్ల కృషి ఫలించలేదు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఆయన మృతిని వైద్యులు ధృవీకరించారు. శ్రీనివాస్‌ను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేశామని వైద్యులు తెలిపారు.

దుబ్బాక ఉపఎన్నిక ఉద్రిక్తతల నేపథ్యంలో.. బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన గంగుల శ్రీనివాస్..నవంబర్‌ 1న‌ బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గేటు ఎదుట 'బీజేపీ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతూనే.. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని శ్రీనివాస్‌ ఆరోపించారు. సంజయ్‌,బీజేపీ కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు అతడిపై నీళ్లుపోసి మంటలార్పారు. అప్పటికే అతను 58శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మంటల్లో కాలి తీవ్రగాయాలైన శ్రీనివాస్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పరామర్శించారు. శ్రీనివాస్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అయిన్పటికీ ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు.. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భారీ బందోబస్తు మధ్య ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని ఇవాళ కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story