మరోసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

మరోసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు అధిక కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరోసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 2021-22 ఏడాది బడ్జెట్‌ను ఉదయం 11.30 నిమిషాలకు ఆర్థికమంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. నిన్న సాయంత్రం సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడుల్లో భారీ వృద్ధిరేటును ప్రభుత్వం అంచనా వేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు అధిక కేటాయింపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు భారీగా నిధులు కావాల్సి ఉంది. ఈ పథకాల అమలుకు నాబార్డ్ , హడ్కో , ఎల్ఈసిఇ లాంటి ఆర్థిక సంస్థల ద్వారా సేకరించే రుణాలపై ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది. ఒక పక్క ఆర్థిక లోటుతో పాటు మాంద్యం ఎఫెక్ట్ కరోనా ప్రభావంతో ఈసారి బడ్జెట్లో ఉద్యోగుల సంక్షేమం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకో పోతున్నారా అనేది ఉత్కంఠ నెలకొంది.

అభివృద్ధి పనులు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెట్టుబడి రుణాలపై వడ్డీల భారం రాష్ట్ర ప్రభుత్వానికి తడిసి మోపెడు అవుతుంది. రాష్ట్ర అవతరణకు ముందు ఉన్న అప్పులు మొదలుకొని ఇప్పటివరకు చేసిన అప్పుల పై రీ పేమెంట్ భారీగా చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఇచ్చిన హామీలపై కొంత జాప్యం నెలకొంది. ఈ బడ్జెట్లో పీఆర్సీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

గతేడాది లక్షా 82 వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం... కరోనా కారణంగా అనుకున్న స్థాయిలో రాబడి రాకపోవడంతో దాదాపు 30 శాతం బడ్జెట్‌ను కుదించుకుంది. దాదాపు 50 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం తగ్గించుకుంది. ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో గత సంవత్సరం బడ్జెట్ ను మించి... ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేస్తూ ఆయా శాఖల బడ్జెట్ అంచనాలు తీసుకుంది ఆర్థిక శాఖ. ఇప్పటికే పలుమార్లు బడ్జెట్ కూర్పు పై సమీక్షంచిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు సమాచారం.

కరోనా నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో వైద్యానికి కేంద్రం పెద్దపీట వేసింది.. కేంద్ర బడ్జెట్ లాగే రాష్ట్ర బడ్జెట్ లో కూడా వైద్య రంగానికి కేటాయింపులు ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది.. దీంతో పాటు ఇరిగేషన్, మౌళిక వసతుల కల్పనకు ఈ సారి బడ్జెట్ లో ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది.. గత బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి బడ్జెట్ అలకేషన్ చేసినా నిధులు ఖర్చు చేయలేదు... అయితే ఈ సారి బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి విధివిధానాలు ఖరారు చేసి.. బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మొత్తమ్మీద కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా వుంటాయనేది మరోకొన్ని గంటల్లో తేలనుంది.

Tags

Read MoreRead Less
Next Story