నాగార్జునసాగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాలు

నాగార్జునసాగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాలు
KCR halia tour:ఆరునూరైనా దళితబంధు అమలు చేసి తీరుతామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

ఆరునూరైనా దళితబంధు అమలు చేసి తీరుతామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి.. ఇటీవల ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ను గెలిపించిన సాగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సర్కారు కృష్ణా జలాలపై దాదాగిరి చేస్తోందని హాలియా వేదికగా సీఎం కేసీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు.

ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించారు. హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. నాగార్జునసాగర్ నియోజకవర్గంపై వరాలు ప్రకటించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 150 కోట్లు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. హాలియా, నందికొండ అభివృద్ధికి 15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే హాలియాలో డిగ్రీ కాలేజీ, మినీ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్..కరోనా కారణంగా నియోజకవర్గానికి రావడానికి ఆలస్యమైందన్నారు. హాలియా పట్టణం అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదని.. అవసరమైతే నాగార్జునసాగర్‌కు మరిన్ని నిధుల మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఇక.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరునూరైనా దళిత బంధు పథకాన్ని అమలు చేసి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. తానే స్వయంగా దళిత

బంధు అమలును పర్యవేక్షిస్తానని చెప్పారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి బ్యాంకుతో సంబంధం లేకుండా 10 లక్షల రూపాయలు ఇస్తామని.. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో వందల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు.

మరోవైపు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంలో కేంద్రం తీరును సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ.. ఏపీ దాదాగిరి చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం, ఏపీ వ్యతిరేక వైఖరితో కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో కృష్ణా జలాలపై ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడతామని.. తెలంగాణ వాటాను సాధించి తీరుతామన్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసామన్న సీఎం కేసీఆర్.. వాటిన్నింటిని ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని స్పష్టంచేశారు.

ఇదిలా ఉంటే.. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ హామీలు గుప్పించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓట్ల కోసమే దళితబంధు సహా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల ఆరోపణలకు అధికార పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే విపక్ష పార్టీలు ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నాయని టీఆర్ఎస్ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story