తెలంగాణ పీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డి..?

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డి..?
పీసీసీ పదవి కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరింది. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథిగా సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని నియమించినట్లు తెలుస్తోంది. అటు రేవంత్‌రెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు హైకమాండ్‌ నుంచి మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా తర్వాత కొత్త సారథి ఎంపికపై హైకమాండ్ సుదీర్ఘ కసరత్తే చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ ఠాగూర్‌ సీనియర్లతో వరుస సమావేశాలు నిర్వహించారు. అందరి అభిప్రాయాలు సేకరించారు. అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతోనూ సమావేశమయ్యారు. అందరి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకున్న ఠాగూర్‌.. హైకమాండ్‌కు తుది నివేదిక ఇచ్చారు.

పీసీసీ పదవి కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్లు చాలా మంది అధ్యక్ష పదవిని ఆశించారు. రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. భట్టి విక్రమార్క, శ్రీధర్‌రెడ్డి, వీహెచ్‌ ఇలా చాలా మంది సీనియర్లు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు. కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కారు.. రేవంత్‌కు పదవి ఇస్తే పార్టీని వీడుతామని కూడా హెచ్చరించారు. వీహెచ్ వంటి నేతలు ఏకంగా ఠాగూర్‌పైనే తీవ్ర విమర్శలు చేశారు. జరిగిన పరిణామాలన్నింటినీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు ఠాగూర్. చివరికి అందరికీ ఆమోదయోగ్యమైన జీవన్‌రెడ్డివైపు అధినాయకత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుంచి రేసులో ప్రముఖంగా వినిపించిన రేవంత్‌రెడ్డికి మాత్రం ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలతో సరిపెట్టినట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story