TS EAMCET: తెలంగాణ ఎంసెట్ పరీక్ష డేట్..

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ పరీక్ష డేట్..
కరోనా నుంచి కాస్త కోలుకున్న రాష్ట్రం విద్యార్థులపై దృష్టి సారించింది.

TS EAMCET: కరోనా నుంచి కాస్త కోలుకున్న రాష్ట్రం విద్యార్థులపై దృష్టి సారించింది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించిన కోర్సుల ప్రవేశానికి గాను నిర్వహించే పరీక్షలు ఆగస్ట్ 4వ తేదీ నుంచి మొదలు కానున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆగస్టు 4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు.. 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన పరీక్షలు ఆన్‌లైన్‌లో జరపనున్నామని మంత్రి ప్రకటించారు.

ఈ మేరకు మంత్రి సోమవారం మూడు ప్రవేశ పరీక్షల సవరణ తేదీలతో పాటు పాలిసెట్ తేదీని కూడా ప్రకటించారు. అన్ని రకాల డిగ్రీ, పీజీ స్థాయి చివరి సెమిస్టర్ పరీక్షలను జులై నెలలో నిర్వహిస్తామన్నారు. ఎంసెట్‌తో పాటు ఈసెట్, పీజీ ఈసెట్ కొత్త తేదీలను ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమర్పించారు. పరీక్షల సవరణ తేదీలకు ఆమోదం తెలిపిన మంత్రి కరోనా మార్గదర్శకాలతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.



ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లొమా చివరి సంవత్సరం పరీక్షలను జులై మొదటి వారంలో ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని విశ్వవిద్యాలయాల అధికారులను మంత్రి ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం చివరి సంవత్సరం పరీక్షలను త్వరగా జరపాలని సీఎం ఆదేశించారని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ల పరీక్షలను కూడా జులై నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story