రైతులకి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!

రైతులకి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!
రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది. రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగులు చేయాలన్నారు సీఎం.

రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది. రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగులు చేయాలన్నారు సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మద్దతు ప్రకటన విషయం వెనుకడుగు వేయబోమని కేసీఆర్ తెలిపారు. గ్రామాల్లో 6వేల 408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందన్నారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన 20వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను రేపు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని కేసీఆర్ ఆదేశించారు.

ఇక కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రిని, సీఎస్‌ను, అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తం 6వేల 408 కొనుగోలు కేంద్రాల్లో 2వేల 131 ఐకేపీ కేంద్రాలు, 3వేల 964 PACS కేంద్రాలు, మిగతావి మరో 313 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు.

రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే విషయంలో కనీస మద్దతు ధర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నరు సీఎం కేసీఆర్. వడ్లు ఎండబోసి తాలు లేకుండా 17శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే వానాకాలం 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని కేసీఆర్ రైతులను కోరారు. 20 నుండి 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందన్నారు. దాదాపు కోటి 17 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం.. 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story