Telangana: మరోసారి కేంద్రం వర్సెస్ తెలంగాణ ఫైట్.. అప్పుల విషయంలో..

Telangana: మరోసారి కేంద్రం వర్సెస్ తెలంగాణ ఫైట్.. అప్పుల విషయంలో..
Telangana: వరిధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై యుద్ధం ప్రకటించింది టీఆర్ఎస్ ప్రభుత్వం.

Telangana: వరిధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై యుద్ధం ప్రకటించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత ప్రాజెక్టులు, నిధులు సహా అనేక అంశాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటూ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మండిపడుతూనే ఉన్నారు. ఇటు కేంద్రమంత్రులు మొదలు రాష్ట్ర బీజేపీ నేతల వరకు టీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.

దీంతో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ దుమారం రేపుతోంది. ఇపుడు మరోసారి కేంద్రం వర్సెస్‌ తెలంగాణగా మారింది పరిస్థితి. రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో కేంద్ర ఆర్థిక శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని వాటిని కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

అయితే దీనిపై తెలంగాణ ఆర్థికశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2021, 22, 23 ఆర్థిక సంవత్సరాలకు అప్పులు తీసుకోవడానికి తెలంగాణకు అనుమతి ఇవ్వకపోవడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ పట్ల వివక్ష చూపడం సరికాదంటూ కేంద్రంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపింది.

నిబంధనల పేరుతో బంధనాలు వేయడం కేంద్రం వివక్షాపూరిత ధోరణికి నిదర్శనమని తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఆరోపించారు. కేంద్రం ఏవిధంగానైతే అప్పులు తీసుకుంటుందో ఆ నిబంధనలనే తెలంగాణ కూడా పాటిస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అప్పులు తీసుకోవడానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని, లేకుంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.

ఆఫ్ బడ్జెట్ అప్పులను రాష్ట్రాల అప్పులను చూస్తామనడం కక్షపూరిత చర్యే అని రామకృష్ణారావు తెలిపారు. కేంద్రం మూల ధన వ్యయం కోసం 2020-21లో 12 వేల కోట్ల రూపాయల రుణం కేంద్రం ఇచ్చిందని తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గుర్తుచేశారు. 2022-23లో లక్ష కోట్ల రుణాలు ఇచ్చిందన్నారు. అయితే ఇవన్నీ మూలధన వ్యయం కోసం ఖర్చు చేసినవని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావని వాదించారు.

కొన్ని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి చూపడం… మరికొన్నింటిని చూపకపోవటం వివక్ష అవుతుందని స్పష్టంచేశారు. 2022-23 ఏడాదిలో రుణాల సమీకరణకు ఇంకా అనుమతి ఇవ్వలేదని తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. మరి.. ఇన్నాళ్లూ వరి ఫైట్‌తో మాటల యుద్ధం జరుగుతుండగా.. ఇపుడు అప్పుల వ్యవహారంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ వేడి మరింత రాజుకుంటుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story