మరో చరిత్ర సృష్టించిన తెలంగాణా పోలీస్ శాఖ

మరో చరిత్ర సృష్టించిన తెలంగాణా పోలీస్ శాఖ

దేశంలోనే తెలంగాణా పోలీస్ శాఖ మరో చరిత్రను సృష్టించింది.. ప్రపంచ స్థాయి పోలీసింగ్ కు ధీటుగా సైబరాబాద్ లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. మరో రెండు నెలల్లో బంజారాహిల్స్ లో ఉన్న మరో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభిస్తే ఇక తెలంగాణాలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది.

తెలంగాణా ఏర్పడిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయంటూ అనేక మంది అవాకులు చెవాకులు పేలారు. కాని అలాంటి వ్యాఖ్యలు చేసిన వారే ముక్కు మీద వేలేసుకునేలా శాంతి భద్రతలను అదుపులో ఉంచడమే కాదు ఏకంగా దేశంలోనే తెలంగాణా పోలీసు డిపార్ట్మెంట్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే సాధ్యమని భావించిన ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. అత్యాధునిక వాహనాలను అందజేసింది. దీంతో పాటుగా ఆ శాఖ తెలంగాణా ప్రజలకు చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, కమ్యూనిటీకి భాగస్వామ్యం చేసింది. దీంతో పాటుగా సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చింది. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు ఐదు లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి.

సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా సైబరాబాద్ కమిషరేట్ లో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డేటా సెంటర్‌ను ఐటీ మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ , విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి లు కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు మూడు కమిషనరేట్ల సీపీలు, అధికారులు, పలు ఐటీ కంపెనీ సీఈఓలు పాల్గొన్నారు.

తెలంగాణాలో పోలీసులు తీసుకున్న చర్యలతోనే శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. ఆరేళ్ళ పాటు సుస్థిర పాలన అందజేయడం ద్వారా అభివృద్ధి సాధించామన్నారు. ఆర్థికాభివృద్ధి సాధించడానికి లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండటమే కారణమన్నారు.

అయితే.. సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ళ పై దృష్టి సారించడం తో పాటు సైబర్ వారియర్స్ ను తయారు చేయాలని సూచించారు. హైదరాబాద్ లో క్రైమ్ చేయాలంటే..సీసీ కెమెరాలకు ఎక్కడ దొరికి పోతామోనన్న భయం దొంగల్లో వచ్చిందన్నారు.. దేశంలో ఉన్న అన్ని సీసీ కెమెరాల్లో 65 శాతం తెలంగాణాలోనే ఉన్నాయన్నారు. ఇటీవల అంబులెన్సు కు దారికోసం ఓ ట్రాఫిక్ పోలీస్.. పరుగెత్తడాన్ని అభినందించారు.

‌సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు హోం మంత్రి మహమూద్ అలీ. పోలీస్ డిపార్ట్ మెంట్ కు నిధులను కేటాయించడంతో పాటు భారీగా భర్తీ చేపట్టారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ లు బాగా పనిచేస్తున్నారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పై సీరియస్ గా దృష్టి పెట్టిందన్నారు డీజీపి మహేందర్ రెడ్డి. క్రైమ్ నివారించడంలో పోలీసులకు టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందన్నారు. సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీస్ లు దేశంలోనే ముందంజలో వున్నారన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నగరం మరింత బాధ్యతగా మారిందన్నారు..

శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలోని 5 లక్షల కెమెరాలను అనుసంధానం చేశారు. ఈ సెంటర్ త్వరలో ప్రారంభించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానంగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story