తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్న భానుడు

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్న భానుడు
అటు చూస్తే వైరస్‌లు.. ఇటు చూస్తే ఎండలు.. రెండు వైపుల నుంచి వరుస దాడులతో జనం వణికిపోతున్నారు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి..

అటు చూస్తే వైరస్‌లు.. ఇటు చూస్తే ఎండలు.. రెండు వైపుల నుంచి వరుస దాడులతో జనం వణికిపోతున్నారు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కక్కుతున్నాడు.. ఉదయం నుంచే నిప్పుల గుండంలో వున్నట్లుగా పరిస్థితి మారిపోతోంది. ఉదయం 9 గంటల తర్వాత ఇంట్లోంచి అడుగు బయటపెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ప్రభావం ఇలా ఉంటే, రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని బెంబేలెత్తిపోతున్నారు.

అటు మాడు పగలగొట్టే ఎండలకు వడగాడ్పులపై వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు మరింతగా భయాందోళనకు గురిచేస్తున్నాయి.. ఏపీలో మూడు రోజులపాటు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు.

ఓ వైపు అల్పపీడనం ప్రభావం.. మరోవైపు పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో ఏపీలో వాతావరణం క్రమంగా మారిపోతోంది.. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో 45 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. భూ ఉపరితలం నుంచి గాలులు వీస్తుంటంతో దక్షిణ కోస్తా, రాయసీమలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం దిశగా గాలులు ఎక్కువగా వీచి ఎండల ప్రభావం ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

అటు, తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రాష్ట్రంలో ఉత్తర దిక్కు నుంచి వేడిగాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు తప్పవంటోది. ఈ మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో ప్రజలు వీలైనంత వరకు బయటికి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తెలంగాణలో ముఖ్యంగా ఐదు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు వాతావరణ అధికారులు. మే నెలలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల వరకు పెరుగుతాయంటున్నారు.. రాష్ట్రంలోని 568 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వంద శాతం ఉండగా, 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం 75 శాతం ఉందని హీట్‌ వేవ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. ఖమ్మం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

నిన్న ఆదిలాబాద్‌ జిల్లాలో 38.8 నుంచి 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెనలో 42.8 డిగ్రీలుగా రికార్డయింది. రాష్ట్రంలో ఉత్తర దిశనుంచి అతి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story