ఐసిసియు వార్డులోనే ఆమె మెడలో తాళి.. మృత్యువుతో పోరాడుతూ చివరికి..

ఐసిసియు వార్డులోనే ఆమె మెడలో తాళి.. మృత్యువుతో పోరాడుతూ చివరికి..
ఓ ప్రేమికుల జంటను విడదీసింది. చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసుల్ని కరోనా కాలరాస్తోంది.

కరోనా ఎంతో మంది జీవితాల్లో కన్నీళ్లు నింపుతోంది. బంధాల్ని, అనుబంధాల్ని దూరం చేస్తోంది. తాజాగా ఓ ప్రేమికుల జంటను విడదీసింది. చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసుల్ని కరోనా కాలరాస్తోంది.

తాజాగా సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మూడేళ్లుగా ప్రేమిస్తున్న ఓ యువకుడిని ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంతలోని కరోనా సోకి ఆస్పత్రి పాలైంది. కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

మూడేళ్లుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడు ఆమెకు ఎంతో ధైర్యం చెబుతూ ఆమెను బ్రతికించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్ పై ఉంచారు. వైద్యుల అనుమతితో వెంటలేటర్ పై ఉన్నప్రేమికురాలితో మాట్లాడాడు.

నీకు వ్యాధి తగ్గిపోతుంది. నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావు అని ధైర్యం చెప్పాడు. ఆ క్షణమే ఆమె మెడలో తాళి కట్టాడు. నేను నీ భర్తను.. నిన్ను కాపాడుకుంటా అని అభయమిచ్చాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆమె జీవితం ముగిసిపోయింది.

కొద్ది రోజులకే మృత్యువుతో పోరాడి అలసి పోయి కన్నుమూసింది. మృతురాలి సోదరుడు, ప్రేమించిన యువకుడు కలిసి ఆ యువతికి అంత్యక్రియలు నిర్వహించారు. యువతి తల్లి దండ్రులకు ఈ విషయం తెలియదు. కరోనా తమ కలలను కల్లలు చేసిందని ప్రేమించిన యువకుడు కన్నీరు మున్నీరవుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story