TRS Plenary 2022: ఘనంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు.. ప్లీనరీ షెడ్యూల్ ఇదే..

TRS Plenary 2022: ఘనంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు.. ప్లీనరీ షెడ్యూల్ ఇదే..
TRS Plenary 2022: గులాబీ పండుగకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి.

TRS Plenary 2022: గులాబీ పండుగకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. పార్టీ 21వ ఆవిర్భావ వేడుకులకు నేతలంతా రెడీ అయ్యారు. మాదాపూర్‌లోని HICCలో జరిగే ప్లీనరీకి పార్టీ శ్రేణులు కదిలివస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆహ్వానమందిన ప్రతినిధులంతా నగరానికి చేరుకుంటున్నారు. సిటీ అంతటా స్వాగత తోరణాలు, పార్టీ జెండాలతో అలంకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది TRS ప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరుకానున్నారు.

ఉదయం 10 గంటలకల్లా నేతలంతా సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. 11 గంటలకు సభా వేదికపైకి సీఎం కేసీఆర్‌ వస్తారు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి, అమరవీరులకు నివాళులర్పించి.. ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సహా.. ప్రత్యేకంగా నియమించిన కమిటీలు.. ఏర్పాట్లను పర్యవేక్షించాయి.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడోసారి అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేలా ప్లీనరీలో వ్యూహరచన చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా ప్లీనరీలో ఎజెండా రూపొదిస్తామన్నారు. దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారుతోందన్నారు. పెరుగుతున్న ధరలపై సామాన్యుడి గళం వినిపించేలా ప్లీనరీలో తీర్మానాలు చేస్తామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ప్లీనరీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులంతా రానుండటంతో ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అలాగే సభా ప్రాంగణం వద్ద బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. సీఎం కేసీఆర్‌ వెళ్లే రూట్లలోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్లీనరీ అంతా ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే ప్లీనరీ తీర్మానాలకు ప్రాధాన్యం ఉంది. ఈ సారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందులో మూడు రాజకీయ తీర్మానాలున్నట్లు సమాచారం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీ, కేంద్ర వైఫల్యాలపై ఉండనున్నాయి. వీటితో పాటు టీఆర్ఎస్‌ అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు, పురస్కారాలు, తదితర అంశాలపై తీర్మానాలుంటాయని తెలుస్తోంది.

ఇక ప్లీనరీలో పాల్గొనేవారందరి కోసం నోరూరించే వంట‌కాల‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. గత అక్టోబర్‌లోనే టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్లీనరీ జరగ్గా.. ఆరు నెలల వ్యవధిలో మరో ప్లీనరీ టీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు సహా మొత్తం 3 వేల మందికి ఆహ్వానం పంపారు. పురుషులు గులాబీ రంగు దుస్తులు, మహిళలు గులాబీ రంగు చీరల్లో హాజరుకావాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story