రాములమ్మ సొంతగూటికి చేరనుందా..?

రాములమ్మ సొంతగూటికి చేరనుందా..?

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాములమ్మ సొంతగూడికి చేరుకుంటుందా..? బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్దంచేసుకుంటుందా అంటే అవుననే అనిపిస్తోంది ఈ మధ్యన జరిగిన రాజకీయ పరిణామాలు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో చేరడం ఖాయం అంటూ ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. లేడీ సూపర్ స్టార్‌గా సినిమాల్లో తనదైన ముద్రవేసుకున్న రాములమ్మ .. రాజకీయాల్లో అడుగుపెట్టి మెదక్ ఎంపిగా గెలిచారు. ఆ తర్వాత అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకివెళ్లి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా పార్టీ గెలుపుకోసం విస్తృతంగాప్రచారం చేపట్టారు. పార్టీ ఓటమితో ఇంటికే పరిమితమయ్యారు.

కాంగ్రెస్ పార్టీనుంచి వలసలు పెరుగుతాయని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. ఈ మధ్య తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సినీనటి కుష్బు బీజేపీ పార్టీలో చేరారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆమె పార్టీలో చేరడం కొంత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు. దీంతోపాటు బీజేపీ సౌత్ ఇండియా సిని ఇండస్ట్రీపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే విజయశాంతిని సొంత గూటికి చేర్చుకునేందుకు పార్టీనేతలు తీవ్రంగా కృషిచేస్తున్నట్లు సమాచారం. 1998 లో బీజేపీలో చేరిన విజయశాంతి, బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా సేవలందించారు. అనంతరం బీజేపీకి రాజీనామా చేసి తల్లితెలంగాణ పార్టీని స్థాపించారు.

2009జనవరిలో తల్లితెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనంచేసి ఆపార్టీ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో టీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరు కేసీఆర్, మరొకరు విజయశాంతియే. 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయడం.. పార్లమెంట్‌లో బిల్లుపెట్టిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం కొద్దిరోజులు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాక తిరిగి యాక్టివ్ అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. స్టార్ క్యాంపెయిన్‌గా అనేక నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం కృషిచేశారు. అయినా పార్టీ ఓడిపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. పార్టీనేతలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న రాములమ్మను సొంత గూటికి రప్పించేందుకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమెతో భేటీ అయ్యారు. దీంతోఆమె వచ్చే నెలలో పార్టీలో చేరడం ఖాయమంటున్నారు పార్టీనేతలు.

అయితే రాములమ్మ పార్టీ మారుతుందన్న వార్తలతో కాంగ్రెస్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ విజయశాంతి ఇంటికి వెళ్లి ఆమెతో చర్చలు జరిపారు. పార్టీలో ప్రాధాన్యత,ఇతర అంశాలపై కూలంకుషంగా చర్చించినట్లు తెలిసింది. విజయశాంతి కిషన్ రెడ్డితో మర్యాద పూర్వగంగా జరిగిన చర్చతప్ప పార్టీమారేందుకు కాదంటూ కుసుమకుమార్ అన్నారు.

దక్షిణాదిలో బలహీనంగాఉన్న బీజేపీని పటిష్టంచేసేందుకు నేతలు శాయశక్తులాప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నటి కుష్బును పార్టీలో చేర్చుకోగా.. ఇప్పుడు తెలంగాణాలో విజయశాంతిని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ సినీ హీరోను పార్టీలో చేర్చుకునేందుకు చర్యలు చేపట్టారు. పార్టీకి దూరంగా ఉంటున్నవారిపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story