ఆ ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం జగన్

ఆ ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం జగన్

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సచివాలయంలోకి అడుగు పెట్టారు వైఎస్ జగన్. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన జగన్‌.. 8 గంటల 39 నిమిషాలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉన్న తన చాంబర్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజలు చేశారు.

సరిగ్గా 8 గంటల 45 నిమిషాలకు ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంలో కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు జగన్‌. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సలహాదారు అజేయ్‌ కల్లం సహా సీఎంవో అధికారులంతా ముఖ్యమంత్రి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్స్ పంచారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాల నాయకులు ఆయన్ని సన్మానం చేయనున్నారు. 10 గంటలకు కార్యదర్శులు, శాఖాధిపతులతో తొలి సమావేశం నిర్వహించనున్న ముఖ్యమంత్రి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మరోవైపు సీఎం కార్యాలయం పక్కనే ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడుతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించనున్నారు. 11 గంటల 15 నిమిషాలకు జరిగే ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ కార్యక్రమంలో సీఎం జగన్‌ కూడా పాల్గొంటారు. అనంతరం తొలి బ్లాకు పక్కనే ఏర్పాటు చేసిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. మంత్రుల ప్రమాణస్వీకారం ప్రారంభమయ్యేంత వరకు సచివాలయంలో బిజీ బిజీగా గడపనున్నారు జగన్.

ముఖ్యమంత్రి జగన్‌ రాక సందర్భంగా సచివాలయంలో భారీ ఏర్పాట్లు చేశారు. సీఎంను స్వాగతిస్తూ సచివాలయ ప్రాంగణంలో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. సచివాలయంతో పాటు సీఎం చాంబర్‌ను ప్రత్యేకంగా అలంకరించారు.

Read MoreRead Less
Next Story