త్వరలో సెక్రటేరియట్‌ కూల్చివేత

త్వరలో సెక్రటేరియట్‌ కూల్చివేత

సెక్రటేరియట్‌ కూల్చివేతకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కనబడుతోంది.. ఈనెల 27న కొత్త సెక్రటేరియట్‌, అసెంబ్లీ కొత్త భవనాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.. కొత్త నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్‌ అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు.

రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ కొత్త భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.. ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్లు, భవనాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.. ఈనెల 27న సచివాలయం, అసెంబ్లీ కొత్త భవనాలకు శంకుస్థాపన చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయించారు.. ఈ నేపథ్యంలో ప్లాన్లు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం కోసం సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వ విధాన నిర్ణయాలకు అనుగుణంగా భవనాల నిర్మాణం కొనసాగాలని కేసీఆర్‌ అధికారులకు సూచించారు. ప్రస్తుతం సచివాలయంలో తొమ్మిది బ్లాక్‌లు ఉన్నప్పటికీ ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయన్నారు.. ఇలా కాకుండా, సచివాలయం మొత్తం ఒకే బ్లాక్‌లో ఉండేలా నిర్మాణాలు జరగాలని అధికారులకు సూచించారు.. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు దేశానికే ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త భవనాల నిర్మాణం సాధ్యమైనంత వేగంగా చేపట్టేందుకు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

అటు పాత భవనాల కూల్చివేత నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే ఆయా శాఖలను వాటి హెచ్‌వోడీల్లోకి ఒక్కొక్కటిగా తరలిస్తున్నారు.. జీఏడీ, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్‌ బీ హెడ్‌ క్వార్టర్స్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆర్థిక శాఖను బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి, హోంశాఖను పోలీస్‌ హెడ్ క్వార్టర్స్‌లోకి, ఇరిగేషన్‌ శాఖను ఈఎన్‌సీ కార్యాలయానికి మార్చుతున్నట్లు సమాచారం. ఇక నూతనంగా నిర్మించబోయే సచివాలయంలో హెలిప్యాడ్‌, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, ఫౌంటెయిన్స్‌, ఆస్పత్రి, లైబ్రరీ, ఆర్టీసీ, రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లతోపాటు షటిల్‌ కోర్టు కూడా నిర్మించనున్నారు. మరోవైపు కొత్త భవనాల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. కాళేశ్వరం తరహాలోనే అసెంబ్లీ, సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story