చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. నెటిజన్స్ ఫైర్

చెప్పడం చాలా తేలిక బాస్.. ఆచరించడం చాలా కష్టం. నీతి వాక్యాలు అరటి పండు ఒలిచినంత తేలిగ్గా చెప్పేస్తారు. ఆచరణలో మాత్రం శూన్యం. సరిగ్గా అలానే చేసింది బాలీవుడ్ భామామణి ప్రియాంక చోప్రా. వేదికలెక్కి వేయి మాటలెన్నైనా చెప్పొచ్చు. అందులో ఒక్కటైనా తాను పాటిస్తుందా. ఇదీ నెటిజన్స్ ప్రశ్న. ఇంతకీ ఏం చేసింది పాపం ప్రియాంక అంత కాని పనీ అంటే.. చిట్టి పొట్టి దుస్తులేసుకున్నా ఊరుకున్నాం. పబ్లిక్‌లో హబ్బీతో ముద్దూ ముచ్చట్లతో మునిగి తేలుతున్నా ఏమీ అనలేక పోతున్నాం. మరి దీపావళి టపాసులు కాల్చకండి నాకు ఆస్తమా ఉంది.. నాలాగే మరి కొంత మంది కూడా బాధపడుతుండొచ్చు. అలాంటి వారికి టపాసుల పొగ పీలిస్తే ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచించండి అని చెప్పిన అమ్మడు.. ఇప్పుడు ఏకంగా సిగరెట్ నోట్లో పెట్టుకుని గుప్పు గుప్పుమని పొగ పీలుస్తుంటే ఆస్తమా గుర్తుకు రాలేదా.. అన్న మాటలు గుర్తుకు రాలేదా అని నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ప్రియాంక చోప్రాపై విమర్శలు గుప్పిస్తున్నారు. భర్త నిక్ జోనస్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మియామీ బీచ్‌లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కింది. ఈ ఫొటోలు వైరల్ అవడంతో అమ్మడిని ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. సలహాలు ఇచ్చే ముందు మనం ఎంత వరకు పాటిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుని ఇవ్వమంటూ ట్రోల్ చేస్తున్నారు. టపాకాయల పొగ పడదు కానీ సిగరెట్ పొగపడుతుందా అని హేళన చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *