ఆ చిన్న పొరపాటు మొత్తం మ్యాచ్‌నే మార్చేసింది

ఆ చిన్న పొరపాటు మొత్తం మ్యాచ్‌నే మార్చేసింది

ఈసారి ప్రపంచకప్‌ పుట్టింటికే చేరింది.. ఇంగ్లండ్‌ 44 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది.. ఎట్టకేలకు ప్రపంచకప్‌ ఇంగ్లండ్‌నే వరించింది.. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ పోరులో ఇంగ్లండ్‌నే విజయం వరించింది.. తొలిసారి ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ గెలవడంతో ఫ్యాన్స్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

క్రికెట్‌లో అసలు మజా ఏంటో ఫ్యాన్స్‌కు చూపించింది వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫైట్‌.. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది.. చివరి బంతి వరకు విజయం దోబూచులాడినా చివరకు ఇంగ్లండ్‌నే వరించింది.. వరల్డ్‌కప్‌ మొదలైన నాటి నుంచి కప్‌ గెలుచుకోలేకపోయిన ఇంగ్లండ్‌.. ఆ చిరకాల కోరికను ఇప్పుడు తీర్చుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో మోర్గాన్‌ సేన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 241 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్‌ 55 పరుగులు, ఫోథమ్‌ 47 పరుగులతో రాణించగా, కెప్టెన్‌ విలియమ్సన్‌ ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు లియామ్‌ ప్లంకెట్‌ క్రిస్‌వోక్స్‌ న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం, కీలక సమయాల్లో న్యూజిలాండ్‌ వికెట్లు చేజార్చుకోవడంతో ఇంగ్లండ్‌ ముందు లక్ష్యం చాలా చిన్నదే అయింది..

అయితే, 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడింది.. ఎంతటి భారీ స్కోరైనా అవలీలగా ఛేదించిన ఇంగ్లండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తడబడింది.. ఆరంభం నుంచే గట్టి బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు న్యూజిలాండ్‌ పేసర్లు. ఓ దశలో 86 పరుగులేకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఆ తర్వాత వచ్చిన స్టోక్స్‌, బట్లర్‌ జోడీ ఆదుకుంది.. స్టోక్స్‌ 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. బట్లర్‌ 59 పరుగులు చేసి ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లండ్‌ కూడా నిర్ణీత ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్‌ కావడంతో మ్యాచ్‌ టైగా మారింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్‌ ఓవర్‌ ఆడించాల్సి వచ్చింది. వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌ టై కావడం, సూపర్‌ ఓవర్‌ ఆడించడం ఇదే మొదటిసారి.. సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 15 పరుగులు చేయగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ కూడా 15 పరుగులు చేసింది. అయితే, ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండే విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌ రెండు బౌండరీలు కొట్టగా.. కివీస్‌ ఒకే ఒక సిక్సర్‌ కొట్టింది.. దీంతో రెండోసారి కూడా ఫైనల్‌ వరకు వచ్చిన న్యూజిలాండ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

చివరి దశలో విజయం న్యూజిలాండ్‌నే వరిస్తుందని ఫ్యాన్స్‌ అనుకుంటున్న టైమ్‌లో ఆ జట్టు చేసిన పొరపాటు మొత్తం మ్యాచ్‌నే మార్చేంది.. ఆఖరి ఓవర్‌లో బౌల్ట్‌ వేసిన ఫోర్త్‌ బాల్‌ను స్టోక్స్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా తరలించాడు.. అప్పటికే రెండు పరుగులు తీశాడు స్టోక్స్‌.. రనౌట్‌ను తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. ఆ సమయంలో బాల్‌ స్టోక్స్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది.. దీంతో చివరి ఓవర్లో ఒకే బాల్‌లో ఏకంగా ఆరు పరుగులు వచ్చాయి.. ఈ ఒక్క తప్పిదమే న్యూజిలాండ్‌ను సూపర్‌ ఓవర్‌ ఆడేలా చేసింది. అయితే, సూపర్‌ ఓవర్‌ కూడా టైగా మారడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టుదే విజయం అనే నిబంధన ప్రకారం ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ ముద్దాడింది. తొలిసారి ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ గెలుచుకోవడంతో ప్లేయర్ల ఆనందానికి అవధుల్లేవు.. మోర్గాన్‌ సేన సంబరాలతో హోరెత్తించింది.. అటు స్టేడియంలో ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ కూడా సంబరాలు చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story