Metaverse Reception: తమిళనాడు జంట వెరైటీ రిసెప్షన్.. దేశంలోనే మొదటిసారి..

Metaverse Reception: తమిళనాడు జంట వెరైటీ రిసెప్షన్.. దేశంలోనే మొదటిసారి..
Metaverse Reception: ఇండియాలో ఇలాంటి మెటావర్స్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

Metaverse Reception: వర్చువల్ రియాలిటీ.. టెక్నాలజీ ప్రియులకు ఈ పదం చాలా సుపరిచితం. ఇది మాత్రమే కాదు మెటావర్స్ అంటే కూడా వారికి బాగానే తెలుసుంటుంది. ఇంతకీ వర్చువల్ రియాలిటీ, మెటావర్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా.. మన ప్రపంచం నుండి పూర్తిగా టెక్నికల్ ప్రపంచంలోకి ప్రయాణం అవ్వడమే. ఆ ప్రపంచంలో మనలాగే చాలామంది మనుషులు ఉంటారు. చూస్తుందంతా నిజమే అనిపిస్తుంది. కానీ ఎవ్వరినీ తాకలేం. అలాంటి ఓ వర్చువల్ రియాలిటీ వరల్డ్‌లోనే తమ రిసెప్షన్‌ను చేసుకోవాలన్న వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది తమిళనాడుకి చెందిన ఓ జంట.

దినేష్ ఎస్‌పీ, జనగనందిని రామస్వామి.. ఈ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యి, ప్రేమలో పడి, ఇప్పుడు వారి ప్రేమను పెళ్లి పీటలెక్కిస్తున్నారు. జనగనందిని సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తుండగా.. తనకు కాబోయే భర్త దినేష్.. ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా చేస్తున్నాడు. దినేష్‌ ఒక టెక్నాలజీ లవర్. అందుకే మెటావర్స్‌లో రిసెప్షన్ చేసుకోవాలనే ఆలోచనతో ముందుకొచ్చాడు. జనగనందిని కూడా ఇది మంచి ఐడియా అంటూ సపోర్ట్ చేసింది.


ఫిబ్రవరి 6న దినేష్, జనగనందిని వివాహం తమిళనాడులో శివలింగాపురం గ్రామంలో జరగనుంది. ఆ తర్వాత వీరు రిసెప్షన్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఈ మెటావర్స్ రిసెప్షన్‌కు అందరూ ఆహ్వానితులే. పైగా ఈ రిసెప్షన్‌కు గెస్ట్‌లు ఎలాంటి బట్టలు వేసుకోవచ్చని కూడా మెటావర్స్‌లో డిసైడ్ చేసుకోవచ్చు. గూగుల్ పే ద్వారా లేదా క్రిప్టో కరెన్సీ్ రూపంలో అయినా వారు కొత్తజంటకు చదివింపులు చేసుకోవచ్చు.

ఇండియాలో ఇలాంటి మెటావర్స్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. కానీ అమెరికాలో ఇప్పటికే ఓ జంట మెటావర్స్‌లో పెళ్లి చేసుకుంది. వారే ట్రేసీ, డేవ్ గాగ్నన్. ఓ పక్క మామూలుగా పెళ్లి జరుగుతున్నప్పటికీ, వారు మెటావర్స్‌లో కూడా ఒకేసారి వివాహాన్ని జరిపించారు. ప్రస్తుతం దినేష్, జనగనందిని మెటావర్స్ రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Tags

Read MoreRead Less
Next Story