కారుపార్క్ కాదు ఎయిర్ పార్క్.. ఇంటికో విమానం మరి..

కారుపార్క్ కాదు ఎయిర్ పార్క్.. ఇంటికో విమానం మరి..
ప్రపంచంలో ఇలాంటి ఎయిర్ పార్క్‌లు దాదాపు 650 వరకు ఉంటాయని అంచనా.

ఓ కారుకి ఓ బండికి పార్కింగ్ ఉంటుంది ప్రతి ఇంటికీ.. కానీ చిత్రంగా విమానం పార్కింగ్ ఉంది కాలిఫోర్నియాలోని కొన్ని ఇళ్లకు. మనం కారేసుకుని వెళ్లినంత ఈజీగా వాళ్లు విమానం వేసుకుని వెళ్లిపోతారు ఎక్కడికైనా. ఈ కమ్యూనిటీ ఇళ్లను ఎయిర్ పార్క్ అని పిలుస్తుంటారు. ప్రపంచంలో ఇలాంటి ఎయిర్ పార్క్‌లు దాదాపు 650 వరకు ఉంటాయని అంచనా.

వాటిలో అత్యంత ఆకర్షణీయంగా ఉండేది యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న కామెరాన్ పార్క్. తాజాగా ఇక్కడ ఇళ్లను అమ్మకానికి పెట్టడంతో ఎయిర్ పార్కులు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. ఒకప్పుడు ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించారు. అయితే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి.

దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఆ 61 ఎకరాల ఎయిర్ పోర్టు చుట్టూ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. పైలెట్లు, విమానం నడిపాలనే ఆసక్తి ఉన్నవాళ్లు, సంపన్నులు ఆ ఇళ్లను కొనుగోలు చేశారు. దాదాపు వంద ఇళ్లు ఉన్న ఈ ప్రాంతంలో జనరల్ ఏవియేషన్‌కు అనుమతి ఉండడంతో చిన్న చిన్న విమానాలను సొంతగా నడిపించుకునే అవకాశం ఉంది.

అలా పైలెట్లు, డబ్బులున్న వాళ్లంతా చిన్న విమానాలను కొనుగోలు చేశారు. వాటిని పార్క్ చేసుకునేలా ఇంటికి ఆనుకొని భారీ గ్యారేజీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రధాన రన్‌వేకి వెళ్లడానికి చిన్న చిన్న రన్‌వేలు.. విమానాలు ఢీ కొట్టుకోకుండా 100 అడుగుల వెడల్పుతో రోడ్లు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story