చంద్రయాన్‌ 2లో మూడు ముఖ్యమైన భాగాలు ఇవే!

చంద్రయాన్‌ 2లో మూడు ముఖ్యమైన భాగాలు ఇవే!

చంద్రయాన్-2 ఉపగ్రహం బరువు 3.8 టన్నులు. దీనిని 640 టన్నుల బరువున్న జీఎస్ఎల్వీ మార్క్3-M1 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళుతుంది. చంద్రయాన్-2 ఉపగ్రహంలో 2.3 టన్నుల బరువున్న ఆర్బిటర్, 1.4 టన్నుల బరువున్న ల్యాండర్, 27 కేజీల బరువున్న రోవర్ అనే ఇండియన్ పేలోడ్స్ ఉంటాయి. వీటితోపాటు అమెరికా, యూరప్ దేశాలకు చెందిన మరికొన్ని పేలోడ్స్‌ని కూడా పంపిస్తున్నారు. వీటితోపాటు ఆర్బిటర్‌లో 8 పేలోడ్స్, ల్యాండర్, రోవర్‌లో మూడేసి పేలోడ్స్‌ని పంపిస్తున్నారు..

చంద్రయాన్‌ 2లో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. మొదటిది ఆర్బిటార్, రెండోది ల్యాండర్, మూడోది రోవర్. వీటిలో ల్యాండర్‌కు విక్రమ్ అని, రోవర్‌ను ప్రగ్యాన్ అని పిలుస్తున్నారు. చంద్రయాన్ 2 జాబిలిపైకి చేరిన తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ఆర్బిటర్ చేరుకుంటుంది. ల్యాండర్‌ను జాబిలిపై దించుతుంది. చందమామపై ల్యాండర్ దిగిన తరువాత అసలు పని మొదలువుతుంది. ఆ ల్యాండర్‌లో అమర్చిన రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేస్తుంది. ఈలోపు చంద్రుడి కక్ష్యలోనే ఆర్బిటర్ పరిభ్రమిస్తూ ఉంటుంది.

ప్రయోగంలో వివిధ విషయాలను తెలుసుకోవడానికి వీలుగా ఈ రోవర్ లో 13 పరికరాలను అమర్చారు. చంద్రుడి ఉపరితలంతో పాటు అక్కడి వాతావరణంపై ఇవి సవివరంగా రిపోర్ట్ ను అందించనున్నాయి. ఇస్రో పంపించే కమాండ్స్‌ని బట్టి రోవర్... చందమామపై దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల మేర తిరుగుతుంది. ఏడాది పాటు అక్కడే ఉండి రసాయన పరీక్షలను నిర్వహిస్తుంది. దాని చిత్రాలను, రిపోర్ట్ ను కేవలం 15 నిమిషాల్లోనే ఆర్బిటర్ ద్వారా పంపిస్తుంది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్‌ 1 జాబిలి ఉత్తర ధృవంపై పరిశోధనలు చేసింది. జాబిలిపై నీటి జాడలు ఉన్నట్లు చంద్రయాన్ 1 కనిపెట్టింది. ఇక చంద్రయాన్‌ 2ను చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనల కోసం పంపిస్తోంది ఇస్రో. చీకటిగా ఉండే దక్షిణ ధృవంలో నీటి ఆనవాళ్లను కనిపెడుతుందని ఆశిస్తున్నారు. ఈ చీకటి ప్రాంతంలో నీటితోపాటు మంచు కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితోపాటు హీలియం 3 నిల్వలపైనా చంద్రయాన్ 2 పరిశోధనలు చేస్తుంది.

చందమామపైకి చంద్రయాన్‌ని పంపిస్తున్న దేశాల్లో మనది నాలుగో స్థానం. ఇప్పటికే రష్యా, అమెరికా, చైనా దేశాలు చందమామపై ఇలాంటి ప్రయోగాలు చేపట్టాయి. ఇక చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడడానికి తొలిసారిగా ఇస్రో 10 వేల మందికి అవకాశం కల్పిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story