అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత.. భారతీయులకు..

అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత.. భారతీయులకు..

భారతీయులకు అమెరికా ఓ రంగుల కల. అష్టకష్టాలు పడైనా USలో అడుగుపెట్టాలని ఆశ పడుతారు. కొద్దిరోజులక్రితమే గ్రీన్ కార్డు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న వారికి స్వీట్ న్యూస్ చెప్పిన అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు ఆ దేశంలో అక్రమంగా ఉంటున్నవారికి షాక్ ఇచ్చింది. ఇల్లీగల్ గా నివసిస్తున్న వారిని అరెస్టుచేసేందుకు రంగం సిద్దం చేసినట్లు ప్రకటించింది.

అమెరికాలో ఉన్న ప్రవాస ఉద్యోగులకు శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు ఇచ్చేందుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. ఒక్కో దేశానికి ఉన్న గరిష్ట నిబంధన ఏడునుంచి 15 శాతానికి మార్చింది. దీంతో దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డుకోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది NRIలకు భారీ ఊరట కల్గించింది. అయితే ఈ బిల్లు అలా పాస్ అయిందో లేదో అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ మరో పిడుగులాంటి వార్త వినిపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వసలదారులను ఏరివేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినట్లు ట్విట్ చేశారు. దేశంలో అక్రమంగా ఉన్నవారిని అరెస్టు చేయడంతోపాటు వారిని దేశ బహిష్కరణ చేయనున్నట్లు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.

ఇప్పటికే దేశంలోకి అక్రమ చొరబాట్లపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికన్ అధికారులు, ప్రెసిడెంట్ ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్స్ పై దర్యాప్తును ముమ్మరం చేశారు. అరెస్టైన వారిని వారి దేశాలకు పంపుతామని, వీరిలో ఎవరైనా నేరాలకు పాల్పడి ఉంటే వారిని నిబంధనల ప్రకారం తమ దేశంలోకానీ, వారి దేశంలోని జైళ్లకు పంపుతామని వెల్లడించారు. అయితే usలో దాదాపు 10లక్షల మంది చట్టవిరుద్దంగా నివాసం ఉంటున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మెక్సికో, గ్వాటెమాలా, హోండూరాస్, చైనాకు చెందినవారు ఉన్నట్లు తెలిపారు. వందల్లో ప్రవాస భారతీయులు కూడా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దేశంలో ముఖ్యంగా అట్లాంటా, షికాగో, న్యూయార్క్, డెన్వర్, బాల్టిమోర్, హ్యూస్టన్, లాస్ ఏంజెలిస్, మియామీ, న్యూ ఆర్లియాన్స్ నగరల్లో దాడులు చేసి అక్రమంగా నివసిస్తున్నవారిని పనిపడుతామని హెచ్చరించారు.

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన చాలామంది H-1 బీ వీసా కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉంటున్నారు. మరి కొందరు వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. టూరిస్టు వీసాతో వచ్చినవారు సైతం కొన్ని సంవత్సరాలుగా దేశంలోనే తలదాచుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా కొద్దిరోజులక్రితం గ్రీన్ కార్డు జారీ ప్రక్రియలో కీలకమైన ఏడు శాతాన్ని తొలగించి 15 శాతానికి పెంచే ఫెయిర్ నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రేంట్స్ యాక్ట్ ఆఫ్ 2019 బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అమెరిన్ కాంగ్రెస్ లో ఆమోదం పొందితే భారతీయులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. అయితే అంతలోనే అక్రమ వలసదారులపై దాడులకు దిగడం అక్కడి ఎన్నారైలను ఆందోళనకు గురిచేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story