కుల్ భూషణ్ విషయంలో మరో కుట్రకు తెర..

కుల్ భూషణ్ విషయంలో మరో కుట్రకు తెర..

కుక్కతోక వంకర అన్నట్లు.. పాకిస్థాన్ బుద్ధి కూడా అంతే. కిందపడినా తనదే పైచేయి అంటూ అడ్డంగా వాదించడం ఆ దేశానికి ఎప్పటి నుంచో అలవాటే. ఇప్పుడు కుల్ భూషణ్ విషయంలోనూ మరో కుట్రకు తెరతీస్తోంది. అతడు "రా" ఏజెంట్ అని భారత్ ఒప్పుకుంటేనే విడుదలపై ఆలోచిస్తామంటూ మెలికపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై పాక్ ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.

ICJ తీర్పుపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. కుల్‌భూషణ్‌ ఉరిశిక్షను ఆపాలనే తీర్పును గౌరవిస్తున్నామంటూ ట్వీట్ చేశారు. జాదవ్ పాకిస్థాన్‌ ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందునే శిక్ష అనుభవిస్తున్నాడని.. చట్టం ప్రకారం నడుచుకుంటామని ఇమ్రాన్ ట్విట్టర్ లో తెలిపారు...

జాదవ్‌ను కాపాడేందుకు అన్ని చర్యలూ చేపడతామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కుల్‌భూషణ్‌ను విడుదల చేసి తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను మరోసారి కోరుతున్నామని రాజ్యసభలో ప్రకటించారు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌. పాక్ పలు సందర్భాల్లో వియన్నా తీర్మానాన్ని ఉల్లంఘించిందన్న భారత్‌ వాదనను ICJ సమర్ధించిందని ఆయన గుర్తుచేశారు.

జాదవ్‌ తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడినందువల్లే 2016లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌ చెబుతోంది. విచారణ చేపట్టిన సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని ప్రధాన అభియోగం. ఈ వాదనలను ఖండిస్తూ, అదే ఏడాది మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. కేసు విచారించిన ICJలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌ వాదనతో ఏకీభవించారు. జాదవ్ కు విధించిన ఉరిశిక్షను పునః సమీక్షించాలనీ, అప్పటి వరకూ శిక్ష అమలును నిలిపివేయాలని పాకిస్థాన్‌కు స్పష్టం చేశారు. అంటే పాక్ వాదనను ICJ ఏ మాత్రం విశ్వసించలేదు. అంతర్జాతీయ వేదికపై పరువుపోయిన పాక్ తీరుమాత్రం మారడం లేదు. ఇప్పుడు కుల్ భూషణ్ ను విడుదల చేయాలంటే.. రా ఏజెంట్ అని ఒప్పుకోవాల్సిందే నంటూ కొత్త మెలిక పెడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story