అమెరికా అధ్యక్షుడికి కిమ్‌ సోదరి వార్నింగ్‌

అమెరికా అధ్యక్షుడికి కిమ్‌ సోదరి వార్నింగ్‌
బైడెన్ జాగ్రత్త.. ఉత్తర కొరియా జోలికొస్తే ప్రశాంతంగా నిద్రపోలేవంటూ గట్టి హెచ్చరికలు పంపింది.

మా జోలికి వస్తే మీకు కంటిమీద కునుకు కరువవుతుందంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను హెచ్చరించారు. ఈ హెచ్చరికలు చేసింది ఎవరో కాదు.. ఉత్తర కొరియాలో నెంబర్ 2 నేతగా చెలామణి అవుతున్న ఆ దేశ అధినేత కిమ్ సోదరి కిమ్ యో జోంగ్. బైడెన్ జాగ్రత్త.. ఉత్తర కొరియా జోలికొస్తే ప్రశాంతంగా నిద్రపోలేవంటూ గట్టి హెచ్చరికలు పంపింది.

సోమవారం నుంచి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకన్‌లు జపాన్‌, దక్షిణ కొరియాల్లో పర్యటిస్తున్నారు. బైడెన్‌ కార్యవర్గంలో బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఈ పర్యటనలో చైనా, ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా మిత్రదేశాలతో సైనిక సంబంధాలను పటిష్ఠం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. స్పందించిన కిమ్‌ సోదరి జోంగ్‌.. ఉత్తరకొరియా పత్రిక రోడాంగ్‌ సిన్‌మున్‌కు ఒక ప్రకటన జారీ చేశారు. మా భూమిపై గన్‌పౌడర్‌ వాసనను వ్యాపింప జేయాలనుకుంటున్న అమెరికా కొత్త పాలక వర్గానికి సలహా ఇస్తున్నాను. మీరు వచ్చే నాలుగేళ్లు నిశ్చింతగా నిద్రపోవాలనుకుంటే.. కంటిమీద కునుకు దూరం చేసే పనులు చేయవద్దు' అని ఘాటుగా హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. గత వారం అమెరికా-దక్షిణ కొరియాలు సంయుక్తంగా యుద్ధవిన్యాసాలు చేపట్టాయి. ఇటు బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉత్తర కొరియా సైతం జనవరిలో ఒక సబ్‌మెరైన్‌ను ఆవిష్కరించింది. అనంతరం మాట్లాడిన ఆదేశ సుప్రీం కిమ్.. అమెరికానే ఉత్తరకొరియాకు తొలి శత్రువని ప్రకటించారు. మరోవైపు.. 2019 వియత్నాంలోని హనోయ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్..ఉత్తర కొరియా అధినేత కిమ్‌ చర్చలు విఫలమైనప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాల్లో పురోగతి లేదు. మరి కిమ్ సోదరి వార్నింగ్ తో అగ్రరాజ్యం అధినేత బైడెన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story