ఐపీఎల్‌లో కరేబియన్ క్రికెటర్ల జోరు!

అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్‌లో ఈసారి విండీస్ ఆటగాళ్ళే ఆధిపత్యం కనబరుస్తున్నారు. మ్యాచ్‌ ఫలితాలను అనూహ్యంగా మలుపు తిప్పేస్తూ చెలరేగిపోతున్నారు. ఇప్పటికే రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతుంటే… తాజాగా పొల్లార్డ్ , గేల్‌ జాయినయ్యారు. అటు బౌలింగ్‌లో అల్జరీ జోసెఫ్ సంచలన స్పెల్‌తో అందరినీ ఆకర్షించడంతో ఐపీఎల్ కాస్తా విండీస్ ప్రీమియర్ లీగ్‌గా మారినట్టు కనిపిస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పన్నెండో సీజన్ మొదలై అప్పుడే మూడు వారాలైపోయింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌లలో చాలా వరకూ చివరి ఓవర్లలో ఫలితం తేలినవే. అయితే ఈ సారి ఎక్కువగా కరేబియన్ క్రికటర్ల జోరే కనిపిస్తోంది. దాదాపు ప్రతీ జట్టులో విండీస్ ఆటగాళ్ళ ప్రాతినిథ్యం ఉండగా… కొన్ని మ్యాచ్‌లలో ఒంటిచేత్తో మ్యాచ్‌ల ఫలితాలను మలుపుతిప్పేసిన సందర్భాలున్నాయి. ఈ సీజన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆండ్రూ రస్సెల్ గురించే… కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతోన్న రస్సెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్నాడు. మూడు మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్ల నుంచి విజయాన్ని లాగేసుకున్నాడంటే ఎలా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లలో రస్సెల్ తన సుడిగాలి బ్యాటింగ్‌తో కోల్‌కతాను గెలిపించాడు. దీంతో ప్రత్యర్థి జట్లకు ఇప్పుడు రస్సెల్ ఫోబియా పట్టుకుంది. క్రీజులోకి అతను రాకుండా ఉండాలని ప్రతీ జట్టూ కోరుకుంటుందంటే ఈ విండీస్ ఆటగాడి జోరేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అటు యూనివర్సల్‌ బాస్‌గా చెప్పుకునే క్రిస్ గేల్ కూడా మెల్లిగా ఫామ్‌లోకి వచ్చాడు. సీజన్ ఆరంభంలో కాస్త తడబడినా… తర్వాత గేర్ మార్చిన గేల్‌ ఇప్పుడు పంజాబ్‌ను మెరుపు ఆరంభాలను ఇస్తున్నాడు. టీ ట్వంటీ క్రికెట్‌లో తన ప్రత్యేకతను నిలుపుకుంటున్న గేల్‌ రానున్న మ్యాచ్‌లలో పంజాబ్‌కు మరింత కీలకం కానున్నాడు.

ఇక సీజన్‌లో ఇప్పటి వరకూ చెప్పుకోదగినట్టు ఆడని కిరణ్‌ పొల్లార్డ్ కూడా ఫామ్‌లోకి వచ్చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో ముంబైకి విజయాన్నందించాడు. దాదాపు మ్యాచ్ చేజారిపోయిన దశలో భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన పొల్లార్డ్ ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు.

Recommended For You