900లకు పైగా సినిమాల్లో నవ్వులు పంచిన ‘ఓల్ ఆంధ్రాకు సోలో అందగాడు’ ‘బాబుమోహన్’ ఏమైపోయాడు

నటనపై మోజుతో చేస్తున్న రెవెన్యూ ఉద్యోగం మానేసి అవకాశాల కోసం బయలుదేరాడు బాబూ మోహన్. కానీ అతని ఫేస్ చూసిన వాళ్లంతా ఎగతాళి చేశారు. మీ ఊర్లో అద్దాలు అమ్మరా.. నువ్వు నటుడివేంటీ.. అంటూ వెటకారాలాడారు. కానీ పట్టుదలతో ప్రయత్నించి.. అనుకున్నది సాధించిన కమెడియన్ బాబూ మోహన్. ఒకప్పుడు టాప్ కమెడియన్ గా ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన బాబూమోహన్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.. ఇవాళ ఈ హాస్య చక్రవర్తి పుట్టిన రోజు.. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన సినీ కెరీర్ ను ఓ సారి చూద్దాం..

కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. అందుకు ఉదాహరణ బాబూ మోహన్. తొలినాళ్లలో అంతా హేళన చేసినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా అనుకున్నది సాధించి చివరికి హోల్ ఆంధ్రాకే సోలో అందగాడిగా మారాడు. దాని వెనక ఆయన కృషి ఉంది.. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్న విధానం కూడా బాబూమోహన్ ఉన్నతికి కారణమని చెప్పొచ్చు. అందుకే చాలాకాలం పాటు బాబూ మోహన్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.

babu-mohan-kota

చదువుకునే రోజుల్నించే బాబూమోహన్ నాటకాలు వేసేవాడు. రవీంద్ర భారతిలో బాబూ మోహన్ ఓ నాటకం వేస్తున్నప్పుడు నిర్మాత రాఘవ చూసి తన ‘ఈ ప్రశ్నకు బదులేది’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇది బాబూమోహన్ తొలి సినిమా. ఇది తొలి సినిమా అయినా బ్రేక్ ఇచ్చింది మాత్రం ఆ తర్వాత వచ్చిన ఆహుతి, అంకుశం చిత్రాలు. ఇవి బాబూ మోహన్ కెరీర్ ను స్థిరపరిచాయి. అంకుశంలో బాబూమోహన్ చేసిన కామెడీ విలన్ పాత్ర బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆ తరహా పాత్రలే వచ్చినా .. కమెడియన్ గానే ఎక్కువగా గుర్తింపు వచ్చింది.

ఎవరైతే అతని రూపం చూసి నటుడిగా పనికిరావన్నారో.. అదే రూపంతో నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు బాబూమోహన్. ఎన్ని పాత్రలు చేసినా.. ఎన్ని సినిమాల్లో నటించినా .. ఇండస్ట్రీలో బ్రేక్ రావడం ముఖ్యం. అది తిరుగులేనిదై ఉండాలి. బాబూ మోహన్ కు అలాంటి బ్రేక్ కూడా చాలా త్వరగానే వచ్చింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన మామగారు లో బిక్షగాడిగా బాబూమోహన్ పాత్ర పండించిన హాస్యాన్ని మర్చిపోవడం అంత సులభం కాదు. ఈ సినిమా తర్వాత కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ ల జంట ఎన్నో సినిమాల్లో అద్భుతమైన హాస్యాన్ని పంచింది.

రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య తర్వాత ఆ స్థాయి జంటగా పేరు తెచ్చుకున్నారిద్దరూ. మామగారు తర్వాత కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ లేని సినిమా లేకుండా పోయింది. ప్రతి సినిమాలోనూ బాబూ మోహన్ తన్నులు తినేవాడిగానే కనిపించాడు. అయినా వీరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఈ ఇద్దరూ వెండితెరపై కనిపిస్తే చాలు.. హాలంతా ఈలలు వేస్తూ గోలలు చేసేవారు ప్రేక్షకులు. నిజానికి హిట్ అయిన పాత్రలో లేక, బ్రేక్ ఇచ్చిన పాత్రలైనా.. ఒకటి రెండు సార్లు చేస్తే మాగ్జిమం మొనాటనీ వచ్చేస్తుంది. కానీ బాబూ మోహన్ విషయంలో అది జరగలేదు. అడుక్కునే వాడిగానో, ఆగర్భ దరిద్రుడిగానో వందల సినిమాల్లో చేసిన బాబూమోహన్ ఏనాడూ బోర్ కొట్టలేదు.. సరికదా సినిమా సినిమాకూ కామెడీ డోస్ పెంచుకుంటూనే పోయాడు.

నాటి స్టార్ కమెడియన్స్ అందరితోనూ బాబూ మోహన్ ది బెస్ట్ కాంబినేషనే. బ్రహ్మానందం, సుధాకర్, ఏవియస్ వంటి వారితో పాటు రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోనూ అదిరిపోయే కామెడీ పండించాడు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో ఒకప్పుడు బాబూ మోహన్ కు అద్భుతమైన క్యారెక్టర్స్ పడ్డాయి. నాటి స్టార్ హీరోయిన్ సౌందర్యతో బాబూ మోహన్ కు ఓ డ్యూయొట్ పెట్టి ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేశాడు ఎస్వీ. ఆ పాటలో అదిరిపోయే స్టెప్పులతో బాబూ మోహన్ కూడా అదే రేంజ్ లో షాక్ ఇచ్చాడు. అలాగే ఇవివి సత్యానారాయణ సినిమాల్లోనూ బాబూ కామెడీ సూపర్ గా వర్కవుట్ అయింది.

ఏ ఆర్టిస్ట్ కైనా క్రేజ్ వచ్చిందంటే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం ఇండస్ట్రీలో మామూలే. అందుకే బాబూ మోహన్ ను హీరోగా పెట్టి సినిమా తీసి అతని క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నారు చాలామంది. అయితే అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ సినిమాలు కామెడీ పండించాయి.. కానీ కమర్షియల్ గా పండలేదు. సుందరవదనా సుబ్బలక్ష్మి మొగుడా తర్వాత.. చాలా తక్కువ టైమ్ లోనే బాబూ మోహన్ ను హీరోగా చూడలేం అని తేల్చేశారు ఆడియన్స్. మరోవైపు కోట శ్రీనివాసరావు కాంబినేషన్ మూవీస్ అన్నీ సూపర్ హిట్ అవుతూనే ఉన్నాయి. ఒకవేళ సినిమా విజయం సాధించకపోయినా వీరి కామెడీ ఎప్పుడూ అభాసుపాలు కాలేదు. అందుకు చాలా సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక్కోసారి వీరి కామెడీ కోసమే రిపీట్ ఆడియన్స్ పెరిగిన సందర్భాలూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

babu-mohan-brahmandam.png
ఇక బ్రహ్మానందంతో చేసిన ఎన్నో పాత్రలు కూడా మనల్ని కన్నీళ్లు పెట్టించేంతగా నవ్వించాయి. ముఖ్యంగా పెళ్లికి ఎదిగిన కొడుకును కాదని అప్పటికే చాలా పెళ్లిల్లు చేసుకున్నా మళ్లీ తనకే పెళ్లి చూపులు ఎరేంజ్ చేసుకున్న తండ్రిగా పెదరాయుడు సినిమాలో వీరి ట్రాక్ ఎవర్ గ్రీన్.. బ్రహ్మానందం బ్రాహ్మణుడిగా, బాబూ మోహన్ కాటి కాపరిగా నటించిన సినిమా ఎర్రోడు. ఈ సినిమాలో ఈ ఇద్దరికీ క్షణం పడదు.. అయినా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంటుంది. స్నేహానికి కులాలుండవని చెప్పిన ఈ సినిమాలో చివరికి బాబూమోహన్ చనిపోతాడు.ఆ సన్నివేశానికి కన్నీళ్లు పెట్టని వారుండరు..

ఎనభైల మధ్యలో కెరీర్ ఆరంభించిన బాబూమోహన్ ఓ రెండు దశాబ్ధాల పాటు తన నవ్వులతో వెండితెరను ముంచెత్తాడు. తర్వాత ఆఫర్స్ తగ్గకపోయినా ఆయనకు పొలిటికల్ చీమ కుట్టింది. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో ఎమ్మెల్యే, తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత రెండుసార్లు ఓడిపోయినా రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి 2014లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో తెరాస నుంచి టికెట్ రాలేదు. దీంతో బిజెపిలో చేరి పోటీ చేసినా ఓడిపోయారు. పొలిటికల్ గా బాబూ మోహన్ కు చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఓ సారి శోభన్ బాబు గురించి తక్కువ చేసి మాట్లాడి మొత్తం ఇండస్ట్రీ కోపానికి కారణమై తర్వాత క్షమాపణలు చెప్పుకున్నారు. ఏదేమైనా నటుడిగా మాత్రం బాబూ మోహన్ పంచిన నవ్వులు తెలుగు వారి ఆయుష్షును అమాంతంగా పెంచాయి.

ప్రస్తుతం బాబూ మోహన్ పెద్దగా నటించడం లేదు. కానీ ఆయన స్థానాన్ని భర్తీ చేయగల కమెడియన్ మనకింత వరకూ రాలేదనే చెప్పాలి. వైవిధ్యమైన ఆహార్యం, డిఫరెంట్ డిక్షన్ తో పాటు పర్ఫెక్ట్ టైమింగ్ ఆయనకున్న ఎస్సెట్స్. అందుకే చాలా తక్కువ టైమ్ లోనే 900లకు పైగా సినిమాలు చేయగలిగారు. ఏదేమైనా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఈ ఓల్ ఆంధ్రా సోలో అందగాడు మళ్లీ రావాలని.. తన నవ్వుల్ని మళ్లీ పంచాలని కోరుకుంటూ మరోసారి బాబూమోహన్ కు బర్త్ డే విషెస్ చెప్పేద్దాం..
– బాబురావు. కె

Recommended For You