విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారిన మోదీ పర్యటనలో సూట్ కేసు

ప్రధాని మోదీ పర్యటనలో ఓ సూట్‌ కేసు రాజకీయ దుమారం సృష్టిస్తోంది. ప్రధాని మోదీ హెలీకాప్టర్‌ నుంచి ట్రంక్‌ పెట్టే తరలించడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ తన హెలీకాప్టర్‌ నుంచి దించిన ట్రంక్‌ పెట్టేలో డబ్బులు తరలించారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ఈ నెల 9న కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వెళ్లారు. చిత్రదుర్గ పర్యటనలో భాగంగా మోదీ ఓ హెలికాప్టర్‌లో రాగా.. రక్షణగా మరో 3 హెలికాప్టర్లు వచ్చాయి. ల్యాండయిన తర్వాత ఒక హెలికాప్టర్‌లో నుంచి నల్లని ట్రంకు పెట్టెను కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు కారులో ఎక్కడికో తరలించారు. ఇదే ఇప్పుడు విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆధారంగా చేసుకున్న కాంగ్రెస్‌ నేతలు.. మోదీ హెలీకాప్టర్‌లో డబ్బు తరలించారనే అనుమానాలు వస్తున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ట్రంక్‌ పెట్టె తరలించిన కారు ప్రధాని కాన్వాయ్‌లోనిది కాదని.. ఆ పెట్టెను రహస్యంగా తరలించారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అంతే కాదు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌. అందుకు సంబంధించిన వీడియోలను సీఈసీకి సమర్పించారు. ఒకవేళ తమ ఆరోపణలు అవాస్తవమైతే.. ప్రధాని మోదీ విచారణకు ఒప్పుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని.. రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Recommended For You