రాయుడుని కాదని కెఎల్ రాహుల్‌ని ఎంపిక చేయడానికి కారణం..

వన్డే ప్రపంచకప్‌ కోసం బీసిసిఐ ఎంపిక చేసిన జట్టుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పాత,కొత్త కలబోతతో ఉన్న ఈ జట్టుకు ప్రపంచకప్‌ గెలిచే అవకాశమెంత… రాయుడు కంటే రాహుల్‌ వైపే సెలక్టర్లు మొగ్గుచూపడం సరైనదేనా… పంత్‌ కంటే కార్తీక్‌కే ఛాన్స్ దక్కడం వెనుక రీజనేంటి…ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇవే హాట్‌టాపిక్‌గా మారాయి.

వన్డే ప్రపంచకప్‌ వస్తుందంటే అందరి దృష్టీ టీమ్ ఎంపికపైనే ఉంటుంది. టైటిల్ ఫేవరెట్‌ టీమిండియా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగా టోర్నీ కోసం బీసిసిఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. పాత , కొత్త ప్లేయర్ల కలబోతతో ఉన్న ఈ జట్టులో తెలుగుతేజం అంబటి రాయుడికి చోటు దక్కలేదు. నిజానికి ప్రపంచకప్‌లో ఆడే జట్టుపై ఎప్పుడో క్లారిటీ వచ్చేసినా… నాలుగో స్థానంలో బ్యాట్స్‌మెన్‌తో పాటు రెండో వికెట్‌ కీపర్‌ పైనే సందిగ్థత నెలకొంది. నాలుగో స్థానంలో రాయుడుకి చోటు దక్కుతుందనుకున్న దశలో ఫామ్ కోల్పోవడం అతని అవకాశాలను దెబ్బతీసింది. దీంతో ఆసీస్‌తో సిరీస్‌లో రాణించిన కెఎల్ రాహుల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అలాగే ఆల్‌రౌండర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న విజయ్ శంకర్‌కూ చోటు కల్పించారు. ఇక రెండో వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ పోటీపడినప్పటకీ… అనుభవమున్న కార్తీక్‌ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు. దీంతో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటోన్న పంత్‌కు నిరాశే మిగిలింది. వికెట్ కీపింగ్‌లో పర్‌ఫెక్ట్‌గా లేకపోవడం పంత్‌కు మైనస్‌గా మారింది.

మరోవైపు ఆల్‌రౌండర్‌ కోటాలో కేదార్ జాదవ్, జడేజా , హార్థిక్ పాండ్యాల ఎంపిక ఊహించిందే… అటు స్పిన్ విభాగంలో చాహల్, కుల్‌దీప్‌యాదవ్‌లను చోటు దక్కింది. కాగా పేస్ విభాగంలో బూమ్రా, భువనేశ్వర్‌, మహ్మద్ షమీలు ఎంపికయ్యారు. ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మన బౌలింగ్ తిరుగులేని విధంగా ఉందని చెప్పొచ్చు. వీరితో పాటు మీడియం పేసర్లుగా హార్థిక్ పాండ్యా , విజయ్ శంకర్ అందుబాటులో ఉండడంతో బౌలింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందీ లేదు. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ శంకర్‌ను ఈ స్థానంలో ఆడించే అవకాశముందని చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కె చెప్పాడు. అతనితో పాటు మరికొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయని వెల్లడించాడు.

టైటిల్ ఫేవరెట్‌ రేసులో ముందున్న టీమిండియా అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతోందని మాజీలు అభిప్రాయడుతున్నా… రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడం కొందరిని ఆశ్చర్యపరిచింది. అయితే వికెట్ కీపింగ్ విషయంలో అనుభవలేమి దీనికి కారణంగా చెప్పొచ్చు. మొత్తం మీద మిషన్ ప్రపంచకప్‌ కోసం బీసిసిఐ ఎంపిక చేసిన టీమిండియా సమతూకంతో ఉన్న నేపథ్యంలో అంచనాలు మరింత పెరగడం ఖాయం.

Recommended For You