ప్రపంచకప్‌.. నాలుగో స్థానంపై తేల్చుకోలేకపోతోన్న సెలక్టర్లు

ప్రపంచకప్‌లో ఆడబోయే భారత జట్టును మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. ఇంగ్లాండ్ వేదికగా వచ్చే నెలలో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం బీసిసిఐ సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. నిజానికి కొన్ని నెలల క్రితమే వరల్డ్‌కప్‌లో ఆడే జట్టుపై దాదాపు క్లారిటీ వచ్చినప్పటకీ… కివీస్ టూర్‌లో వైఫల్యం, ఆసీస్‌తో సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడంతో కొన్ని స్థానాలపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో నాలుగో స్థానంపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం కలవరపెడుతోంది. అలాగే రెండో వికెట్‌ కీపర్‌తో పాటు ఆల్‌రౌండర్‌ కోటాలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచకప్‌లో ఆడే జట్టులో దాదాపు 11 మందిపై సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే నిర్ణయానికి రాగా… మిగిలిన నాలుగు స్థానాల కోసమే చర్చ జరగనుంది. నాలుగో స్థానంలో ఆడడం ఖాయమనుకున్న దశలో అంబటి రాయుడు నిలకడలేమితో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ రాయుడు ఆటతీరు గొప్పగా లేకపోవడంతో అతని ఎంపికపై సందిగ్ధత నెలకొంది. అలాగే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాహుల్ చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తుండడంతో రాహుల్‌ వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశముంది. ఇక రెండో వికెట్‌ కీపర్‌గా రిషబ్ పంత్ , దినేశ్ కార్తీక్ పోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఆల్‌రౌండర్‌గా జట్టులో నిలదొక్కుకుంటోన్న విజయ్ శంకర్‌కూ అవకాశాలున్నాయి. ఇటీవల ఆసీస్‌తో సిరీస్‌లో విజయ్ శంకర్ ఆకట్టుకోగా.. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ పర్వాలేదనిపిస్తున్నాడు. అయితే ఇంగ్లాండ్ పిచ్‌ల దృష్ట్యా బౌలర్‌ కావాలనుకుంటే ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌లలో ఒకరికి చోటు దక్కొచ్చని భావిస్తున్నారు. ఇటీవల సొంతగడ్డపై ఆసీస్‌తో సిరీస్‌ కోల్పోయినప్పటకీ… ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ రేసులో ముందుంది. దీంతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయడంపైనే సెలక్టర్లు పూర్తి దృష్టి పెట్టారు.

Recommended For You